విజయ్ ని పీఎం గా చేసేది రాహుల్ నే ...టీవీకే సంచలనం !
ఇదిలా ఉంటే ప్రధానిగా విజయ్ అవుతారన్న ధీమాను టీవీకే మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వ్యక్తం చేయడం విశేషం.
టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అయి నాలుగు నెలలకు దగ్గర కావొస్తోంది. ఆయన చేతిలో ఇంకా 56 నెలల పాలన ఉంది. ఇక రాజకీయాలకు విజయ్ కొత్త. ఆయన తొలిసారిగా టీవీకే తరఫున పోటీ చేస్తే జనాలు అధికార పీఠానికి సమీపంగా తీసుకుని వచ్చారు. కాంగ్రెస్ తదితర పార్టీల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అంతలోనే ప్రధాని పీఠం మీద విజయ్ కి మనసు మళ్ళిందా లేక టీవీకేలో విజయ్ మెచ్చుకోలు కోసం ఆ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు తలో విధంగా మాట్లాడుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారా అన్నది తెలియడం లేదు కానీ విజయ్ పీఎం అంటూ తమిళనాడులో హోరెత్తిపోతోంది. ఇదంతా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ ఇటీవల వచ్చిన సర్వే వల్లనే జరిగింది అన్నది కూడా ఉంది. ఆ సర్వేలో రాహుల్ తరువాత విజయ్ తొమ్మిది శాతం ఓట్లతో మూడో అభ్యర్ధిగా ప్రధాని రేసులో ఉన్నారు. అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద నంబర్ తో ఆధిక్యత సాధించడమే టీవీకేలో కొత్త ఆశలను పెంచుతోందా అన్న చర్చ నడుస్తోంది.
హాట్ గా డిబేట్ :
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇంకా మూడేళ్ళ వ్యవధిలో ఉన్నాయి. అయితే అపుడే ప్రధాని పదవి గురించి విపక్ష శిబిరంలో పోటీ మొదలైందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు మరీ ముఖ్యంగా ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిగా అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో తమిళనాడులో టీవీకే రూపంలో కొత్త నేస్తం తోడు అయ్యారని కాంగ్రెస్ సంబరపడుతోంది. అయితే ఈ సంబరం అంతా ఇపుడు ఆందోళనగా కాంగ్రెస్ కి మారుతోంది. ఎందుకంటే అనూహ్యంగా విజయ్ పీఎం రేసులోకి దూసుకుని వచ్చారు. మూడ్ ఆఫ్ ది నేషన్ ఎంచుకున్న అభ్యర్థులలో విజయ్ ఒకరు కావడం విశేషం. ఇక ఆయన ఏకంగా తొలి పర్యాయమే 9 శాతం ఓట్లను ఎలా రాబట్టుకున్నారు అంటే జెన్ జీ ప్రభావం అని అంటున్నారు. దాంతో ఇదే జోరు ముందు సాగితే తమ నేత పీఎం పీఠం ఎక్కుతారు అని టీవీకే నేతలు అభిప్రాయపడుతున్నారు. దాంతో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అంతా వైనాట్ పీఎం విజయ్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు.
మహిళా ఎమ్మెల్యే జోస్యం :
ఇదిలా ఉంటే ప్రధానిగా విజయ్ అవుతారన్న ధీమాను టీవీకే మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వ్యక్తం చేయడం విశేషం. 2029 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా విజయ్ ఉంటారని ఆమె స్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాదు విజయ్‌ని ప్రధాని కుర్చీలో రాహుల్ తానే స్వయంగా కూర్చోబెడతారు అని కూడా అన్నారు. విజయ్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో రాహుల్ కూర్చోబెట్టారు కదా అదే తీరున ప్రధాని కుర్చీలోనూ ఆయనే కూర్చోబెడతారని ఆమె అన్నారు. ఇక 2029 నాటికి అదే ఏడాది దేశ రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతాయని ఆమె చెప్పడం విశేషం. ఇక తమిళనాడులోని టీవీకే ప్రభుత్వ కూటమి నుంచి బయటికొస్తామన్న కాంగ్రెస్ హెచ్చరికపై కూడా ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో మీరే చూస్తారు అని ఆమె చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు చూస్తే టీవీకే కొత్త వ్యూహాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.
చర్చ కాదు రచ్చగా :
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లోనూ సోషల్ మీడియాలో టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్‌ను భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతారనే వ్యాఖ్యలు విపరీతంగా ఇపుడు వైరల్ అవుతున్నాయి. తమిళనాట రాజకీయ వర్గాల్లో విజయ్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుతో ఆయన పీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రస్తుతం తమిళనాడులో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది.దీంతో రాబోయే ఎన్నికల నాటికి డీఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా టీవీకే తమిళనాడు;ఓ సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పీఎం గా విజయ్ అన్నది చర్చగా మొదలై ఇపుడు రచ్చగా మారుతోంది.