ప్రమోషన్స్ వద్దు.. పీస్ చాలు.. జెన్ జెడ్ కొత్త మంత్రం?
పెద్ద పదవి వద్దు.. భారీ జీతం వద్దు.. వీకెండ్‌లో పని చేయడం అస్సలు వద్దు. ఇదీ నేటి జెన్ జెడ్ యువత మైండ్‌సెట్ అంటోంది.
పెద్ద పదవి వద్దు.. భారీ జీతం వద్దు.. వీకెండ్‌లో పని చేయడం అస్సలు వద్దు. ఇదీ నేటి జెన్ జెడ్ యువత మైండ్‌సెట్ అంటోంది. కెరీర్‌లో ఎదగాలంటే మేనేజర్ కావాలి.. టీమ్ లీడ్ కావాలి.. చివరికి సీఈవో కుర్చీలో కూర్చోవాలి అనే పాత తరం ఫార్ములాను ఈ తరం కాస్త పక్కకు నెట్టేస్తోంది. ‘‘ఉద్యోగం చేసేది బతకడానికి.. బతకడం మర్చిపోయి ఉద్యోగం చేయడానికి కాదు’’ అంటూ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తోంది.
ఇటీవల ‘ఎమిరిస్’ నిర్వహించిన సర్వేలో భారత జెన్ జెడ్ యువతలో 74 శాతం మంది కెరీర్‌లో భారీ పదవులు, పెద్ద వేతనాల కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది. అంటే ప్రమోషన్ వచ్చినా.. దానితో పాటు అదనపు బాధ్యతలు, ఎక్కువ గంటల పని.. అంతులేని మీటింగ్స్ వస్తే ‘‘థ్యాంక్యూ.. కానీ నాకు ఈ ప్రమోషన్ వద్దు’’ అనే పరిస్థితి అన్నమాట.. అంతేకాదు.. కెరీర్‌లో సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా నాయకత్వ స్థానానికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా జెన్ జెడ్ భావిస్తోంది. అంటే బాస్ అవ్వకపోయినా బాగానే ఉంటాం.. కానీ బాస్ ఫోన్ మాత్రం ఆఫీస్ టైమ్ అయిపోయిన తర్వాత రావద్దు అన్నట్టుగా ఉంది.
విదేశాలకు వెళ్లి చదవడం కూడా ఎందుకులే!
ఒకప్పుడు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో చదువు అంటే భారత విద్యార్థులకు కలల ప్రపంచం. ‘‘ఒక్కసారి అక్కడికి వెళ్తే లైఫ్ సెటిల్’’ అనుకునేవారు. కానీ జెన్ జెడ్ మాత్రం ఇప్పుడు లెక్కలు వేసుకుంటోంది. వీసా సమస్యలు, పెరుగుతున్న ఖర్చులు, విదేశీ విద్యకు భారీ ఫీజులు చూస్తుంటే.. ‘‘మన దగ్గరే చదువుకుంటే తప్పేంటి?’’ అనే ఆలోచన పెరుగుతోంది. అంటే.. విదేశాల్లో చదువుకోవాలనే కల కంటే.. అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండాలనే కోరిక బలపడుతోందన్నమాట.
నెట్‌వర్కింగ్ అంటే మాత్రం భయమే!
ఇక్కడే జెన్ జెడ్ కథలో అసలు ట్విస్ట్ ఉంది. కెరీర్‌లో ఎదగడానికి పరిచయాలు, కనెక్షన్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ పరిచయం చేసుకోవడానికి మాత్రం చాలామందికి చేతులు ముందుకు రావడం లేదు. లింక్డ్ ఇన్ నివేదిక ప్రకారం.. భారత్‌లో దాదాపు 83 శాతం మంది జెన్ జెడ్ యువత నెట్‌వర్కింగ్‌లో వెనుకబడుతున్నారు. ఏకంగా 79 శాతం మంది నెట్‌వర్కింగ్ ప్రాముఖ్యతను గుర్తిస్తున్నప్పటికీ 52 శాతం మందికి ‘‘అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి?’’ అనే దగ్గరే బ్రేకులు పడుతున్నాయి.
కొత్త వ్యక్తిని కలిస్తే పేరు అడగాలి.. ఏం చేస్తారో అడగాలి.. తర్వాత మన గురించి చెప్పాలి. ఇంత చిన్న పని చేయడానికి కూడా ‘‘వాళ్లు ఏమనుకుంటారు?’’ అనే ఆలోచన మొదలవుతోంది. ఫలితంగా లింక్డ్ ఇన్ లో వేలాది కనెక్షన్స్ ఉన్నా.. అవసరమైనప్పుడు మాట్లాడేందుకు మాత్రం ఒక్కరిని కూడా వెతకాల్సిన పరిస్థితి..
‘పీస్ కావాలి’ అంటూనే.. ‘కనెక్షన్స్’ మాత్రం కావాలి
జెన్ జెడ్ కి సమస్య ఇదే. పని విషయంలో ఒత్తిడి వద్దు.. జీవితంలో బ్యాలెన్స్ కావాలి.. కానీ కెరీర్‌లో అవకాశాలు కూడా కావాలి. అయితే ఆ అవకాశాల కోసం కొత్త వ్యక్తులను కలవాలి అంటే మాత్రం కొంచెం మొహమాటం. కెరీర్‌లో ఎదగడానికి కేవలం డిగ్రీలు, స్కిల్స్ సరిపోవు. సరైన సమయంలో సరైన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా కీలకమే. ఉద్యోగ సమాచారం నుంచి కొత్త అవకాశాల వరకు నెట్‌వర్కింగ్ ఎన్నో తలుపులు తెరవగలదు. మొత్తానికి జెన్ జెడ్ చెప్పే మెసేజ్ చాలా క్లియర్‌గా ఉంది. ‘‘ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్లేదు.. జీతం పెంచకపోయినా ఓకే.. కానీ నా పీస్ ఆఫ్ మైండ్ మాత్రం తీసుకోకండి.
అదే సమయంలో కెరీర్‌లో మంచి అవకాశం తలుపు తట్టినప్పుడు.. దాన్ని తెరవడానికి కావాల్సిన ‘కనెక్షన్’ కోసం మాత్రం ఫోన్ తీసుకోవాల్సిందే. లేకపోతే పీస్ ఉంటుంది.. కానీ ప్రమోషన్, కొత్త అవకాశం మాత్రం పక్కింటివాడికి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.