ఒక్క ఓటు… చరిత్రను మార్చిన విజయం!

ఈ విజయ వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ఉంది. ఈ గెలుపుకు కారణమైన ఆ ఒక్క ఓటు ఎవరిదో కాదు.. మస్కట్‌లో స్థిరపడిన మణికందన్ శివానంతం అనే ప్రవాస భారతీయుడిది.;

Update: 2026-05-05 07:02 GMT

ప్రజాస్వామ్యంలో "నాదొక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే?" అని నిర్లక్ష్యం చేసే వారికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కళ్ళు తెరిపించే గుణపాఠాన్ని నేర్పాయి. ప్రతి ఓటూ వజ్రాయుధమేనని.. అది ఏకంగా ఒక నియోజకవర్గ తలరాతనే మార్చగలదని తిరుప్పత్తూర్ నియోజకవర్గ ఫలితం నిరూపించింది. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అభ్యర్థి కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించారు.

ఉత్కంఠభరిత పోరు.. నువ్వా నేనా?

తిరుప్పత్తూర్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ నుంచే టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి.. ఆయన ప్రత్యర్థికి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం దోబూచులాడింది. చివరకు కౌంటింగ్ ముగిసే సమయానికి అధికారులు వెల్లడించిన ఫలితాలు చూసి అందరూ నివ్వేరపోయారు. టీవీకే అభ్యర్థి సాధించిన ఓట్లు.. 83,375.. ప్రత్యర్థి అభ్యర్థి సాధించిన ఓట్లు 83,374.. మెజారిటీ ఒక్క ఓటు.. ఈ గెలుపు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఒక్క ఓటు తేడాతో విజయం దక్కడం అంటే అది ప్రజాస్వామ్యానికే గెలుపు అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఖండంతరాలు దాటి వచ్చిన 'ఆ' ఒక్క ఓటు!

ఈ విజయ వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ఉంది. ఈ గెలుపుకు కారణమైన ఆ ఒక్క ఓటు ఎవరిదో కాదు.. మస్కట్‌లో స్థిరపడిన మణికందన్ శివానంతం అనే ప్రవాస భారతీయుడిది. తలపతి విజయ్ అంటే మణికందన్‌కు ప్రాణం. తన అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చి దేశం కోసం పోరాడుతుంటే.. తాను మౌనంగా ఉండకూడదని భావించాడు.

ఎన్నికల తేదీ ప్రకటించగానే.. మస్కట్ నుంచి ఇండియాకు రావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. "నా ఒక్క ఓటు పార్టీకి ఏమవుతుంది?" అని అతను అనుకోలేదు. "నా ఓటు నా నాయకుడికి అవసరం" అని నమ్మాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఫలితాలు వచ్చాక మణికందన్ వేసిన ఓటే గెలుపు ఓటుగా తేలడంతో సోషల్ మీడియాలో అతనే అసలైన 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రజాస్వామ్య శక్తికి నిలువెత్తు సాక్ష్యం

సాధారణంగా ఎన్నికల సమయంలో సెలవు దొరికిందని విహారయాత్రలకు వెళ్లేవారు.. ఓటు వేయడానికి బద్ధకించేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ తిరుప్పత్తూర్ ఫలితం అటువంటి వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ఉంది. "ఒక ఓటుతో ఏమవుతుందిలే అనుకుంటే.. ఈ రోజు టీవీకే అభ్యర్థి ఓడిపోయేవారు. మణికందన్ లాంటి వ్యక్తుల సంకల్పమే ప్రజాస్వామ్యానికి బలం." అని ఒక రాజకీయ విశ్లేషకుడు ఆడిపోసుకున్నారు.

విజయ్ పార్టీకి ఇది కేవలం ఒక నియోజకవర్గ విజయం మాత్రమే కాదు.. భవిష్యత్తు రాజకీయాలకు ఒక బలమైన పునాది. ప్రతి పౌరుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే.. వ్యవస్థలో మార్పు సాధ్యమేనని ఈ ఘటన చాటిచెప్పింది. మణికందన్ వంటి అభిమానుల ప్రేమే ఈ గెలుపుకు అసలైన ఇంధనం. ఈ ఒక్క ఓటు విజయం తమిళనాడు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గుర్తుంచుకోండి.. మీ ఓటు మీ హక్కు మాత్రమే కాదు.. అది చరిత్రను మార్చే శక్తి!

Tags:    

Similar News