పరకామణిలో రూ.100 కోట్లు దోచేస్తే.. లోక్ అదాలత్ లో రాజీ చేస్తారా?

పరకామణిలో దాదాపు రూ.100 కోట్లు అక్రమాలు జరిగినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రూ.40 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్లు రాసుకున్నారని ఆరోపించారు.;

Update: 2025-09-20 14:12 GMT

బీజేపీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీ పరకామణిలో దొంగతనం జరిగిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గత ప్రభుత్వంలో పరకామణిలో దొంగతనం చేస్తే చెట్టు కింద పంచాయతీ చేసినట్లు లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేవుడు ఆస్తిని దొంగతనం చేస్తే రాజీ చేసే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. లోక్ అదాలత్ లో రాజీపై తాము హైకోర్టును ఆశ్రయించగా, సీబీ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వంలో పరామకణిలో చోరీ చేసిన నిందితుల నుంచి అప్పటి అధికారులు వాటాలు తీసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాను టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేవంలోనే దీనిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే టీటీడీ అక్రమాలపై అప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతున్నందున మరోమారు విచారణ జరిపించలేమని ఈవో చెప్పినట్లు తెలిపారు. ఒక సారి లోక్ అదాలత్ లో రాజీ అయిన కేసును మళ్లీ పునర్విచారించలేమని చెప్పారని భానుప్రకాష్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజాగా పరకామణిలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించిందని వెల్లడించారు.

పరకామణిలో దాదాపు రూ.100 కోట్లు అక్రమాలు జరిగినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రూ.40 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్లు రాసుకున్నారని ఆరోపించారు. పరకామణిలో దొంగతనం చేస్తే చెట్టుకింద పంచాయతీ చేసినట్లు అప్పటి పెద్దలు లోక్ అదాలత్ లో రాజీ చేశారని విమర్శించారు. పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చి రాజీకి ఒప్పించారని టీటీడీ విజిలెన్స్ కోర్టుకు నివేదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పరాకామణిలో రవికుమార్ అనే వ్యక్తి పరాకామణిలో అమెరికన్ డాలర్లు దొంగిలించిన వీడియో ఆయన మీడియా సమక్షంలో ప్రదర్శించారు.

పరాకామణిలో స్వామి వారి హుండీ ఆదాయం లెక్కిస్తుండగా, రవికుమార్ అనే వ్యక్తి 112 అమెరికన్ డాలర్లు దొంగిలించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని భానుప్రకాష్ తెలిపారు. ఇందులో 9 అమెరికన్ డాలర్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారని, వాటి విలువ సుమారు రూ.72 వేలు ఉంటుందని వివరించారు. 112 అమెరికన్ డాలర్లు దొంగిలిస్తే విజిలెన్స్ అధికారులు 102 నోట్లు దాచేశారని, ఇవి ఎవరి వద్ద ఉన్నాయి? ఎవరు కాజేశారని ప్రశ్నించారు. ఆ రోజు రవికుమార్ దొంగిలించిన నోట్ల విలువ రూ.10 లక్షలు ఉంటుందని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.

శ్రీవారి డబ్బు దొంగతనంపై గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఒకరు అప్రూవర్ గా మారనున్నట్లు భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. రూ.100 కోట్లు దోచుకున్న వారి అసలు రంగు తేల్చమని భక్తుల నుంచి తమపై ఒత్తిడి వస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. త్వరలో అసలైన దోషులు పేర్లు బయటపడతామని స్పష్టం చేశారు. టీటీడీ వ్యవహారాల్లోని అవినీతిపై మరింత లోతుగా దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

భానుప్రకాష్ రెడ్డి బయటపెట్టిన సంచలన వీడియోతో తిరుమల వేదికగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కూటమి ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ సరిగా లేదంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వరుసగా ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏ వైసీపీ నేత మాట్లాడని విధంగా భూమన విమర్శలు చేస్తుండటం ఎప్పటికప్పుడు చర్చకు దారితీస్తోంది. ఎస్వీయూ గోశాలలో భారీగా మూగజీవాలు మరణిస్తున్నాయని, మహా విష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో భూమనను టార్గెట్ చేస్తూ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విడుదల చేసిన సంచలన వీడియో వివాదాన్ని ఎటు మలుపుతిప్పుతుందనే ఉత్కంఠ రేపుతోంది.

Similar News