ప్రపంచ దేశాలను భయపెడదామని వేసిన టారిఫ్ లు చివరికి ట్రంప్ మెడకే చుట్టుకున్నాయి
ఇక్కడ అసలు తలనొప్పి ఏంటంటే అప్పట్లో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను ఫెడరల్ ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లో కలిపేసి హాయిగా ఖర్చు పెట్టేసింది.
అంతర్జాతీయ వేదికలపై "నా ఇష్టం... నా రూల్స్" అంటూ తొడగొట్టి దిగుమతి సుంకాలు బాదిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రపంచ దేశాలను భయపెడదామని వేసిన వేషాలు చివరికి తన పీకలకే చుట్టుకున్నాయి. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అడ్డుపెట్టుకుని పరిమితులు దాటి విధించిన భారీ దిగుమతి సుంకాలను అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక దెబ్బతో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాల మొత్తాన్ని వడ్డీతో సహా కంపెనీలకు తిప్పి ఇచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అధికారం మనదే కదా అని అత్యవసర అధికారాలు వాడేస్తే చివరికి జేబు ఖాళీ అయి పరువు కూడా పోతుందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
2026 ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిపడేసిన తీర్పు ట్రంప్ మార్క్ ‘దాదాగిరి’కి పూర్తిగా చెక్ పెట్టింది. ప్రజాస్వామ్యంలో పన్నులు, సుంకాలు విధించే పక్కా అధికారం పార్లమెంట్ అయిన కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని.. అత్యవసర అధికారాల పేరుతో అధ్యక్షుడు సొంతంగా టారిఫ్‌లు బాదేస్తానంటే కుదరదని కోర్టు నిండైన స్వరంతో తేల్చి చెప్పింది. ట్రంప్ తన పరిమితులు దాటి వ్యవహరించారని స్పష్టం చేయడంతో అప్పట్లో ఆయన యంత్రాంగం దౌర్జన్యంగా వసూలు చేసిన మొత్తాలన్నింటినీ దిగుమతిదారులకు వెనక్కి ఇచ్చేయక తప్పడం లేదు.
అప్పట్లో "దేశానికి భారీగా రాబడి తెస్తున్నా" అని డబ్బాలు కొట్టుకున్న ట్రంప్ యంత్రాంగం ఈ సుంకాల ద్వారా సేకరించిన మొత్తం అక్షరాలా 166 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ రూపాయిల్లో దాదాపు 15.70 లక్షల కోట్లు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతి పరిణామాల్లో భాగంగా ఇప్పటికే అందులో 100 బిలియన్ డాలర్లకు పైగా అంటే దాదాపు 9.51 లక్షల కోట్ల రూపాయలను వడ్డీతో సహా కంపెనీలకు రీఫండ్ రూపంలో చెల్లించేశారు. మిగిలిన దాదాపు 65 బిలియన్ డాలర్ల పైచిలుకు క్లెయిమ్‌లు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అంటే వసూలు చేసిన సొమ్ములో దాదాపు మూడింట రెండొంతులు ఇప్పటికే జేబులోంచి బయటకు వెళ్ళిపోయింది.
ఇక్కడ అసలు తలనొప్పి ఏంటంటే అప్పట్లో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను ఫెడరల్ ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌లో కలిపేసి హాయిగా ఖర్చు పెట్టేసింది. ఖజానాలోకి వచ్చిన సొమ్ము ఇప్పటికే ఖర్చైపోయిన తర్వాత ఇప్పుడు ఒకేసారి వందల బిలియన్ డాలర్ల మొత్తాన్ని జేబులోంచి తీసి రీఫండ్ చేయాల్సి రావడం అమెరికా బడ్జెట్ లెక్కలను పూర్తిగా అటకెక్కించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ ఒక్క రీఫండ్ల ప్రక్రియ వల్లే కేవలం ఒకే నెలలో అమెరికా బడ్జెట్ లోటు రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు తమ గొప్పతనంగా, ఆదాయ వనరుగా చూపించుకున్న సొమ్ము ఇప్పుడు పెను భారంగా మారడం ట్రంప్ ఆర్థిక నిర్వహణలోని లొసుగులను నలుగురి ముందూ బయటపెట్టింది.
"చైనా, భారత్, జపాన్ ఆట కట్టిస్తా" అని పగల్భాలు పలికిన ట్రంప్ సుంకాల వల్ల అసలు దెబ్బతిన్నది అమెరికా కంపెనీలేనని ఇప్పుడు క్లియర్‌గా తేలిపోయింది. తమపై పడిన అదనపు భారాన్ని తట్టుకోలేక ఆ కంపెనీలే కోర్టులకెక్కి సుదీర్ఘ న్యాయపోరాటం చేసి ఈ రీఫండ్లను సాధించుకున్నాయి. మరోవైపు ఈ సుంకాల రద్దుతో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి ఆసియా దేశాల ఎగుమతిదారులకు చాలా పెద్ద ఉపశమనం లభించింది.
అప్పు చేసి పప్పుకూడు తిన్నా పర్లేదు కానీ తిన్న పప్పుకూడును అడిగి మరి కక్కించుకుంటేనే కష్టమని ఆర్థిక నిపుణులు నవ్వుకుంటున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సెటిల్‌మెంట్‌గా నిలిచిన ఈ 'రీఫండ్ రామాయణం' అధికార గర్వంతో విచక్షణ కోల్పోయి తీసుకునే తొందరపాటు నిర్ణయాలు చివరికి దేశ ఖజానాను ఎలా గుల్ల చేస్తాయో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.