హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ కు ఎసరు?

అయితే, ఇతర సహ యజమానులతో కలిసి లేదా తన క్లయింట్ అనుమతి లేదా సమాచారం లేకుండానే ఐరా రియాల్టీ, ట్రంప్ రియాల్టీతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జరిపారని లాయర్ ఆరోపించారు.;

Update: 2025-05-13 06:28 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ట్రంప్ రియాల్టీ కంపెనీ హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్‌కు భూ వివాదం చుట్టుకుంది. కోకాపేటలోని అత్యంత విలువైన భూమిలో ఈ నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్ చేయగా, ఆ స్థలంలో సహ యజమాని ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసు జారీ చేయడంతో ప్రాజెక్ట్ భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్ కోకాపేటలో అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్స్‌ను నిర్మించాలని ట్రంప్ రియాల్టీ, వారి భారతీయ భాగస్వామి ఐరా రియాల్టీతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్ట్ అనుమతులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే పనులు ప్రారంభం కావచ్చని గతంలో ప్రచారం జరిగింది. గోల్డెన్ మైల్ ప్రాంతంలోని ఐరా రియాల్టీకి చెందిన స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూమి వివాదంలో చిక్కుకుంది. నాందెల రామ్ రెడ్డి అనే వ్యక్తి తాను ఆ స్థలంలో సహ యజమానినని పేర్కొంటూ, తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ట్రంప్ టవర్స్ ప్రకటనలు వెలువడుతున్నాయని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగ లీగల్ నోటీసు జారీ చేశారు.

రామ్ రెడ్డి తరపు న్యాయవాది పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ట్రంప్ టవర్స్ నిర్మించ తలపెట్టిన 12,602 గజాల మొత్తం స్థలంలో తన క్లయింట్ నాందెల రామ్ రెడ్డికి 425 గజాల మేర ల్యాండ్ షేర్ ఉందని తెలిపారు. ఈ స్థలాన్ని ఐరా కంపెనీతో పాటు మరో పది మందికి పైగా వ్యక్తులు కలిసి కొనుగోలు చేశారని, వారిలో తన క్లయింట్ కూడా ఒకరని పేర్కొన్నారు.

అయితే, ఇతర సహ యజమానులతో కలిసి లేదా తన క్లయింట్ అనుమతి లేదా సమాచారం లేకుండానే ఐరా రియాల్టీ, ట్రంప్ రియాల్టీతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జరిపారని లాయర్ ఆరోపించారు. సహ యజమాని అనుమతి లేకుండా స్థలంలో నిర్మాణాలు చేపట్టడంపై రామ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి భూ వివాదాలు తలెత్తితే ట్రంప్ రియాల్టీ వంటి అంతర్జాతీయ కంపెనీలు ప్రాజెక్టుతో ముందుకు వెళ్లడానికి వెనుకాడతాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే, హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ నిర్మాణం మరోసారి వాయిదా పడటం లేదా పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సహ యజమాని అభ్యంతరం ప్రాజెక్ట్‌కు పెద్ద అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News