ట్రంప్ సుంకాల షాకులు.. అమెరికన్లకు వాతలు

వెనకటికి ఒక మూర్ఖుడు తాను కూర్చున్న చెట్టు కొమ్మను కోస్తూ.. తనకు మించిన తెలివైనోడు లేడని మురిసిపోయాడట.;

Update: 2025-09-05 03:54 GMT

వెనకటికి ఒక మూర్ఖుడు తాను కూర్చున్న చెట్టు కొమ్మను కోస్తూ.. తనకు మించిన తెలివైనోడు లేడని మురిసిపోయాడట. కాసేపటి తర్వాతేం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు కూడా ఇప్పుడు అలానే ఉంది. ప్రపంచ దేశాలు తమ కంపెనీల మీద భారీ పన్నులు వేస్తున్నాయన్న మాటలు చెప్పి.. ఇష్టారాజ్యంగా సుంకాల షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. ఒక పద్దతి పాడు లేకుండా.. పక్కా వ్యూహం లేకుండా తన చిట్టి మనసుకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరుతో ప్రపంచంలోని పలు దేశాలు హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. ట్రంప్ ముందు వరకు ప్రపంచం ఎదుర్కొన్న పరిణామాలకు భిన్నంగా ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలిసిందే.

గడిచిన రెండు.. మూడు నెలలుగా కొన్ని దేశాల మీద కత్తి కట్టి వారిపై సుంకాల షాకులు ఇస్తూ.. దాని కారణంగా అమెరికన్ల బతుకుల్ని.. అమెరికా దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళుతున్నట్లుగా ఆయన చెబుతున్న మాటలు అన్ని ఇన్ని కావు. నిజంగానే.. ఆయన చెబుతున్నట్లు పలు దేశాల మీద విధిస్తున్న సుంకాల కారణంగా ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆదాయం ట్రంప్ ఖజానాకు చేరుతుందని చెప్పే వాదనలో నిజం ఎంత? అన్నది ప్రశ్న.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క ఆగస్టు నెలలోనే ప్రపంచంలోని పలు దేశాల మీద విధించిన సుంకాల షాకుల కారణంగా అమెరికా ఖజానాకు చేరిన సంపద 31 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. భారత రూపాయిల్లో చెప్పాలంటే ఇది రూ.2.73 లక్షల కోట్లు. నెలలో ఇంత భారీ ఆదాయం రావటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) ఇప్పటివరకు 158 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే తాజా ఆదాయం రెండున్నర రెట్లు ఎక్కువని చెప్పాలి. వివిధ దేశాల మీద సుంకాలు విధించిన తర్వాత అమెరికా ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ లో 17.4 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా.. మేలో అది కాస్తా 23.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూన్ లో 28 బిలియన్ డాలర్లు అయితే.. జులై నాటికి 29 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇక.. ఆగస్టులో రికార్డు స్థాయిలో 31 బిలియన్ డాలర్లుగా వైట్ హౌస్ వెల్లడించింది.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. గత ఏడాదిలో వచ్చిన ఆదాయం మొత్తం.. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లోనే అగ్రరాజ్యం గడించింది. భారీ స్థాయిలో విధించిన సుంకాల్ని ట్రంప్ సమర్థించటం ద్వారా అమెరికా ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టినట్లుగా ఆయన చెప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఆదాయం బిగ్ బ్యూటిపుల్ బిల్లుకు అయ్యే ఖర్చును భర్తీ చేస్తుందని ట్రంప్ వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక్కడో మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదేమంటే.. వివిధ దేశాల మీద విధించిన సుంకాలకు సంబంధించిన అసలు షాకులు ఆయా దేశాల మీద కంటే కూడా అమెరికన్ల మీదనే ఎక్కువగా ఉందంటున్నారు. అదెలానంటే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద విధిస్తున్న సుంకాల మొత్తం అమెరికాలోని ప్రజల మీద నేరుగా ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. విదేశాల మీద వచ్చే వస్తువుల మీద విధించే ఎగుమతి సుంకం నేరుగా అమెరికా ఖజానాకు చేరుతుంది. అదేసమయంలో సుంకాల షాకుల కారణంగా అమెరికాకు వచ్చే విదేశీ వస్తువులు.. వస్తు సేవల ధరలు భారీగా పెరుగుతాయి. ఇక్కడో ఉదాహరణ చెబితే విషయం మరింత తేలిగ్గా అర్థమవుతుంది.

చైనాలో తయారైన ఒక ఏసీ మీద 25 శాతం సుంకం విధిస్తే.. అదే ఏసీని అమెరికన్ కొన్నపక్షంలో.. ట్రంప్ సుంకాల కారణంగా ఏసీ ధర పెరిగి.. అంతిమంగా అమెరికన్ జేబుకు చిల్లుపెడుతుంది. ఆర్థికవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. ట్రంప్ విధిస్తున్న సుంకాలు వివిధ దేశాలకు భారం సంగతి పక్కన పెడితే.. సొంత దేశస్తుల మీదా భారీ ఖర్చుకు కారణమవుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా చరిత్రను గుర్తు చేస్తున్నారు. 2018-19 మధ్య కాలంలో అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

అప్పట్లో ఈ రెండు దేశాల మధ్య మొదలైన ట్రేడ్ వార్ పుణ్యమా అని ఒక్క చైనా నుంచి దిగుమతులపై వసూలైన మొత్తం అప్పట్లో 23 బిలియన్ డాలర్లు. దీని కారణంగా దిగుమతుల ధరలు పెరిగి అమెరికన్ల మీద పడిన భారాన్ని ప్రస్తావిస్తూ.. ఒక అధ్యయనం ప్రకారం అప్పట్లో ఒక్కో అమెరికన్ కుటుంబం మీద కనిష్టంగా 400 డాలర్లు.. గరిష్ఠంగా 800 డాలర్ల భారం పడినట్లు చెబుతారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతుందని చెబుతున్నారు.

సుంకాల కారణంగా వస్తువుల ధరలు పడి.. వాటికి ఎక్కువ ధరలు చెల్లించాల్సింది అమెరికన్ ప్రజలేనని మర్చిపోకూడదు. దీంతో.. సుంకాల కారణంగా ఎగుమతులు చేసిన దేశాల మీదే కాదు అమెరికా ప్రజల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. సుంకాల కారణంగా ఇప్పటికే ప్యాక్డ్ ఫుడ్ మీద 0.5 శాతం నుంచి 2 శాతం మేర.. వస్త్రాల మీద 3 శాతం నుంచి 12 శాతం.. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ మీద ఒక శాతం నుంచి ఆరు శాతం వరకు.. హోం అప్లయన్స్ మీద 5 శాతం వరకు అదనపు భారం పడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ట్రంప్ సుంకాల షాక్ సంగతేమో కానీ.. అమెరికా ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించక తప్పట్లేదు.

Tags:    

Similar News