ఐఫోన్ ధర లక్ష కాదు.. ఇక రూ.3 లక్షలు?
ఈ నేపథ్యంలో వెడ్‌బుష్ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ డాన్ ఇవ్స్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన "విమోచన దినోత్సవ" ప్రసంగంలో ప్రపంచవ్యాప్త సుంకల ద్వారా అమెరికన్ ఉద్యోగాలు , కర్మాగారాలు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ విధానం అమెరికన్ వినియోగదారులపై ముఖ్యంగా సాంకేతిక ఉత్పత్తుల విషయంలో తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వెడ్‌బుష్ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ డాన్ ఇవ్స్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆపిల్ తన ఐఫోన్ ఉత్పత్తిని అమెరికాకు తరలిస్తే ఒక్కో పరికరం ధర దాదాపు $3,500 (సుమారు రూ. 3 లక్షలు) కు చేరుకుంటుందని ఆయన CNNతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుత సగటు ధర (రూ. లక్ష) కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
"వెస్ట్ వర్జీనియా లేదా న్యూజెర్సీ వంటి ప్రాంతాలలో అత్యాధునిక చిప్‌లు , భాగాలను తయారుచేసే కర్మాగారాలతో సహా ఆపిల్ సంక్లిష్ట సరఫరా గొలుసును అమెరికాలో నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీని కారణంగానే ఐఫోన్‌ల ధర $3,500 చేరుకుంటాయి" అని ఇవ్స్ వివరించారు. అంతేకాకుండా, "తయారీ ఒక్క రాత్రిలో తిరిగి వస్తుందని చెప్పలేమని" అని ఆయన స్పష్టం చేశారు.
ఆపిల్ తన సరఫరా గొలుసులో కేవలం 10% మాత్రమే అమెరికాకు మార్చడానికి దాదాపు $30 బిలియన్ల వరకు ఖర్చవుతుందని.. దీనికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని ఇవ్స్ అంచనా వేశారు. ప్రస్తుతం ఐఫోన్ సరఫరా గొలుసు ఆసియాలో చాలా లోతుగా పాతుకుపోయింది. ముఖ్యంగా చిప్‌లు తైవాన్‌లో, డిస్‌ప్లేలు దక్షిణ కొరియాలో తయారవుతుండగా, దాదాపు 90% ఐఫోన్‌ల తుది అసెంబ్లీ చైనాలో జరుగుతోంది.
ట్రంప్ సుంకల ఒత్తిడి కారణంగా సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడవచ్చనే భయంతో ఆపిల్ స్టాక్ ఇప్పటికే 25% వరకు పడిపోయింది. సుంకల యుద్ధం వల్ల నేరుగా ప్రభావితమైన కంపెనీ ఆపిల్ అని ఇవ్స్ అభిప్రాయపడ్డారు. దీనిని ఆయన"ఆర్థిక వినాశనం" అని అభివర్ణించారు.
అయితే సుంకల ప్రభావాన్ని తగ్గించడానికి ఆపిల్ గత నాలుగేళ్లలో అమెరికాలో $500 బిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కంపెనీ భారతదేశం , బ్రెజిల్ వంటి దేశాలను కూడా పరిశీలిస్తోంది. కానీ ఈ దేశాలలో కూడా వాటి స్వంత సుంకాలు , ఉత్పత్తి సామర్థ్య పరిమితులు ఉన్నాయి. భారతదేశం 26% సుంకాన్ని కలిగి ఉండగా బ్రెజిల్‌పై 10% సుంకం ఉంది. అంతేకాకుండా చైనా భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ రెండు దేశాలు భర్తీ చేయలేవు.
ఆపిల్ తన సరఫరా గొలుసును మార్చినా లేదా మార్చకపోయినా ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. రోసెన్‌బ్లాట్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం ఆపిల్ పూర్తి సుంకల భారాన్ని వినియోగదారులపై వేస్తే ఐఫోన్ ధరలు 43% వరకు పెరగవచ్చు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌కు చెందిన నీల్ షా మాత్రం తయారీ ఎక్కడికి తరలించబడుతుందనే దానిపై ఆధారపడి 30% ధర పెరుగుదలను అంచనా వేశారు.
మొత్తానికి అమెరికన్ తయారీని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ట్రంప్ తీసుకువచ్చిన సుంకల విధానం ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ఇది వినియోగదారుల ధరలను పెంచడమే కాకుండా అమెరికాలో హై-టెక్ ఉత్పత్తి యొక్క ఆచరణీయతను కూడా ప్రశ్నార్థకం చేస్తుంది.