భారత్ పై టారిఫ్ లు అమెరికాకే బ్యాక్ ఫైర్
టారిఫ్‌ల బెదిరింపుల వల్ల రష్యా చమురు భారత్‌కు మరింత చౌకగా లభించడం ప్రారంభించింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన టారిఫ్‌లు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోగా, అమెరికాకే నష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రముఖ అమెరికా మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, ది ఎకనమిస్ట్ వంటి పత్రికలు ఈ అంశంపై విభిన్న కోణాల్లో కథనాలు ప్రచురించాయి.
టారిఫ్‌లు రష్యాకు లాభం:
వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషకురాలు క్యారెల్ ర్యాన్ అభిప్రాయం ప్రకారం.. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం పెంచిన టారిఫ్‌లు అనుకున్నదానికి విరుద్ధంగా ఫలితాలు ఇచ్చాయి. తొలుత టారిఫ్‌ల భయంతో భారత కొనుగోలుదారులు రష్యా చమురును వదిలి మధ్యప్రాచ్యం నుండి ఆర్డర్లు పెట్టినప్పటికీ రష్యా చమురు ధరలను గణనీయంగా తగ్గించడంతో తిరిగి భారత మార్కెట్‌ను ఆకర్షించిందని ఆమె పేర్కొన్నారు.
టారిఫ్‌ల బెదిరింపుల వల్ల రష్యా చమురు భారత్‌కు మరింత చౌకగా లభించడం ప్రారంభించింది. ఒక బ్యారెల్ యూరల్స్ క్రూడ్ ఆయిల్ ధర టారిఫ్ బెదిరింపుల కంటే ఒక డాలర్ తక్కువగా ఉందని ర్యాన్ వివరించారు. ఈ పరిణామం రష్యాకు ఆర్థికంగా లాభం చేకూర్చగా, అమెరికాకు మాత్రం వ్యూహాత్మకంగా నష్టం కలిగిస్తోంది.
* అమెరికా విదేశాంగ విధానానికి నష్టం
అమెరికన్ మీడియా విశ్లేషకులు ట్రంప్ విధానాలు అమెరికా విదేశాంగ విధానానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
కన్సర్వేటివ్ వ్యాఖ్యాత బెన్ షాపీరో భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా, ప్రోత్సాహకాలు ఇవ్వడంలో మాత్రం వెనుకబడి ఉందని విమర్శించారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు అంతగా కీలకమైనవి కానప్పటికీ, భారత్ యొక్క భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయరాదని షాపీరో హెచ్చరించారు.
అమెరికా నాటో కంటే భారత్‌తోనే ఎక్కువ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని, ఒకవేళ భారత్ చైనా శిబిరంలోకి వెళితే ప్రపంచ భౌగోళిక సమీకరణమే మారిపోతుందని ఆయన హెచ్చరించారు.
* చైనాకు చేరువవుతున్న భారత్?:
ది ఎకనమిస్ట్ పత్రిక సైతం ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేసింది. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం గమనార్హం అని పేర్కొంది. ఈ సదస్సును ది ఎకనమిస్ట్ "షీ జిన్‌పింగ్ యొక్క అమెరికా వ్యతిరేక వేదిక"గా అభివర్ణించింది.
మోడీ ఈ సదస్సుకు హాజరు కావడం "భారత్ అమెరికా వైపు నుండి చైనా వైపు మలుపు తిరుగుతున్న సంకేతం" అని పత్రిక పేర్కొంది.
ఈ విశ్లేషణలన్నీ ట్రంప్ విధానాలు భారత్‌ను దూరం చేసి, రష్యా- చైనా వంటి అమెరికా ప్రత్యర్థులకు దగ్గర చేస్తాయనే ఆందోళనను స్పష్టం చేస్తున్నాయి. ఇది అమెరికాకు దీర్ఘకాలంలో వ్యూహాత్మక నష్టాన్ని కలిగిస్తుందని మీడియా అభిప్రాయపడుతోంది.