పుతిన్ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Ukraine-Russia War) మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ కోసం మంతనాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో.. రష్యా ఉక్రెయిన్‌పై చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.;

Update: 2025-05-26 07:22 GMT

ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Ukraine-Russia War) మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ కోసం మంతనాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో.. రష్యా ఉక్రెయిన్‌పై చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్రంగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తీరు మీద ఆయన విరుచుకుపడ్డారు. పుతిన్ "పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని" ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా రష్యా పతనానికి దారితీస్తుందని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.

తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఆయనకు ఏం అవుతుందో అర్థం కావట్లేదని ట్రంప్ పేర్కొన్నారు. "పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారు. ఇక్కడ నేను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదు. కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు" అని ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్ ఉక్రెయిన్‌లో కొంత భూభాగాన్ని కాదు, ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. "ఆయన దృష్టిలో అది సరైనదే కావొచ్చు.. కానీ, అది రష్యా పతనానికే దారితీస్తుంది" అని ట్రంప్ హెచ్చరించారు. పుతిన్ దూకుడు వైఖరి రష్యాకే నష్టం చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తన విమర్శలను పుతిన్‌కు మాత్రమే పరిమితం చేయలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "జెలెన్‌స్కీ మాట్లాడే విధానం కూడా ఆయన దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ఆయన మాట్లాడే ప్రతి మాటా సమస్యలు సృష్టిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఆపాలి" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

యుద్ధం మొదలవ్వడానికి ప్రస్తుత అమెరికా పరిపాలన అసమర్థతే కారణమని ట్రంప్ పరోక్షంగా విమర్శించారు. "మూడేళ్ల క్రితం నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతల జ్వాలలను ఆపేందుకు నేను ప్రయత్నిస్తున్నా" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా, రష్యా ఉక్రెయిన్‌పై ఆదివారం రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా ఏకంగా 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ భీకర దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, అమెరికా మౌనంగా ఉంటే అది పుతిన్‌ను మరింత ఉత్సాహపర్చినట్లు అవుతుందని విమర్శించారు. అమెరికా నుంచి మరిన్ని సైనిక సహాయం, వాయు రక్షణ వ్యవస్థలు అవసరమని ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దాడులు ప్రపంచ దేశాలను మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags:    

Similar News