అమెరికాలో తాజా పరిస్థితిపై మనోళ్లు ఏమంటున్నారు?
గతానికి భిన్నంగా భారత్ విషయంలో ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న తీరు.. సుంకాల షాకులు ఇవ్వటమే కాదు.. భారతీయ విద్యార్థులు గతంలో మాదిరి పార్ట్ టైం జాబులు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.;
డాలర్ కలను నెరవేర్చుకోవటం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే మనోళ్ల సంఖ్య భారీగానే ఉంటుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా భారత్ విషయంలో ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న తీరు.. సుంకాల షాకులు ఇవ్వటమే కాదు.. భారతీయ విద్యార్థులు గతంలో మాదిరి పార్ట్ టైం జాబులు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి వేళ.. అక్కడ పరిస్థితి ఏమిటి? అన్న విషయాన్ని ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
అమెరికాకు తమ పిల్లల్ని పంపేందుకు ఆలోచిస్తున్న మనోళ్లు.. అక్కడున్న ప్రవాస భారతీయులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అందరి నోటి నుంచి వస్తున్న మాట ఒక్కటే. ఇప్పుడు వద్దు బ్రో.. పరిస్థితులు ఏమీ బాగోలేవని. గతానికి భిన్నంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు మాత్రమే కాదు..ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్నెల్ల వ్యవధిలో అమెరికా లేబర్ మార్కెట్ నేలబారుకు చేరినట్లుగా చెబుతున్నారు. ఐటీ సెక్టార్ లో ఎప్్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నత చదువుల కోసం వెళుతున్న విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో కొత్తగా యూఎస్ ప్లాన్ చేస్తున్న వారు తమ నిర్ణయం మీద పునరాలోచనలో పడుతున్నారు. అమెరికాలోని నిరుద్యోగ గణాంకాల్ని అక్కడి బ్యూరో ఆఫ్ లేబర్ సంస్థ వెల్లడిస్తూ ఉంటుంది.
జులై 19 నాటికి అమెరికాలో నిరుద్యోగుల జాబితాలో 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7లక్షలకు పెరిగినట్లుగా వెల్లడైంది. అంటే.. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 8 వేల చొప్పున పెరిగినట్లు. గడిచిన ఆరు వారాల వ్యవధిలో ఒక్క ఐటీ సెక్టార్ లోనే దాదాపు 5.8 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించటం గమనార్హం. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు 50,200 మాత్రమే.
యూఎస్ జాబ్ మార్కెట్ లో ఇలాంటి పరిస్థితి ఐదేళ్ల క్రితం కూడా లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మాల్స్.. పెట్రోల్ బంకులు.. రెస్టారెంట్లు.. డెలివరీ విభాగం లాంటి కొన్నిచోట్ల చిరు ఉద్యోగాలు చేసేందుకు కొన్ని దేశాలకు చెందిన వారికి అమెరికా లేబర్ వీసాల్ని జారీ చేస్తుంది. దీన్ని క్లాస్ 4గా పేర్కొంటారు. ఈ పనులు చేసేందుకు భారతీయులకు అనుమతి లేదు. ఉన్నత చదువుల కోసం వెళ్లే మెజార్టీ భారతీయులు ఇలాంటి పార్ట్ టైం జాబులు చేస్తూ ఆర్థికంగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు.ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ మార్కెట్ పై ఆంక్షలు ఎక్కువ కావటంతో మనోళ్లు ఆ ఉద్యోగాల్ని చేయటం పెద్ద రిస్కుగా మారింది.
ఎందుకంటే.. ఈ తరహా ఉద్యోగాలు చేసే వారి డేటాను నిఘా పెట్టి మరీ సేకరిస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థులు ఈ పనులు చేయటం మానేశారు. మరోవైపు.. భారతీయ విద్యార్థులు ఈ ఉద్యోగాల్ని చేయని నేపథ్యంలో వేరే వారికి ఆ జాబ్ లు ఇచ్చేందుకు రెస్టారెంట్ యజమానులు ఇష్టపడటం లేదు. దీనికి కారణం.. వారు డిమాండ్ చేస్తున్న జీతాల్ని షాపుల వారు ఇచ్చే పరిస్థితి లేకపోవటమే. దీంతో.. తమ షాపుల్ని వీలైనంతగా ఆటోమేటెడ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో ఉన్న వారే భయం భయంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఇలాంటి వేళ కొత్తగా అమెరికాకు రావటానికి మించిన తప్పు మరొకటి ఉండదని.. ప్రస్తుతానికి అమెరికా ఆలోచనను కొన్నేళ్లు వాయిదా వేయటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో.. బీకేర్ ఫుల్.