పౌరులకు హెచ్చరిక, అధికారులకు ఆదేశాలు.. ఇరాన్ లో ట్రంప్ టెన్షన్ స్టార్ట్!
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు.;
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాల నుంచి దాడులు ఇప్పుడు దాడులు పౌర నివాసాలవైపు. దీంతో.. పశ్చిమాసియా రగిలిపోతుంది! ఈ సమయంలో ఇప్పటికే టెహ్రాన్ ను వదిలి పౌరులు ఇతర ప్రాంతాలకు కదులుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ నుంచి రెండు కీలక చర్యలు షాకింగ్ గా మారాయి.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారిన నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. జీ-7 సదస్సు నుంచి ఆగమేఘాలమీద అమెరికాకు బయలుదేరారు. పైగా.. వచ్చీరాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రతా సలహాదారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికాకు బయలుదేరనున్నారని తెలిపారు. కెనడా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం జీ7 సభ్య దేశాల నేతలతో గ్రూప్ ఫోటో దిగిన ట్రంప్.. తాను అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సి ఉందని చెప్పి బయలుదేరారు.
ఈ సందర్భంగా... తాను అమెరికాకు రాగానే వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఆదేశించారు. దీంతో.. ఇజ్రాయెల్ - ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో... అణు ఒప్పందం విషయంలో ఇరాన్ మొండికేస్తుందని.. తాను ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోవడంలేదని ఆగ్రహంగా ఉన్న ట్రంప్... తాజా యుద్ధంలో అమెరికా సైన్యాన్ని రంగంలోకి దిగి, భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన పౌరులకు చేసిన తాజా ప్రకటన ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోందని అంటున్నారు.
ఇందులో భాగంగా... తాజాగా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్... తాను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదనే విషయాన్ని ఇప్పటికే పదే పదే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా... ప్రజలంతా టెహ్రాన్ ను ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు సూచించారు. ఇలా కెనడా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన అమెరికాకు బయలుదేరడం, వచ్చీ రాగానే భద్రతా సలహాదారులతో సమావేశానికి ఆదేశాలివ్వడంతోపాటు పాటు టెహ్రాన్ ను ఖాళీ చేయాలని పౌరులకు పిలుపునివ్వడంతో ఈ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.