నోబెల్ శాంతి బహుమతి దక్కని వేళ.. ట్రంప్ లేటెస్ట్ రియాక్షన్ ఇదే!

అవును... నోబెల్‌ శాంతి బహుమతి లభించిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోతో మాట్లాడినట్లు ట్రంప్‌ వెల్లడించారు.;

Update: 2025-10-11 06:06 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని నానారకాల ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. ఏ రెండు దేశాల మధ్య ఏ చిన్న సమస్య ఉన్నా.. ఆ దేశాధినేతలను వైట్ హౌస్ కి రప్పించి శాంతి ఒప్పందాలు చేయించారు. అనంతరం వారితోనే తనకు శాంతి బహుమతి కోసం మద్దతు ప్రకటించే కార్యక్రమానికి తెరలేపారు!

ఈ విధంగా పాకిస్థాన్, ఇజ్రాయెల్, కంబోడియా, అర్మేనియా, అజార్ బైజాన్ మొదలైన దేశాల నుంచి మద్దతు కూడగట్టుకున్నారు. తాజాగా రష్యా అధినేత పుతిన్ సైతం ఆ పనికి పూనుకున్నారు! ఇదే సమయంలో... ఇజ్రాయెల్ - ఇరాన్, థాయిలాండ్ - కంబోడియా, రువాండా - కాంగో, భారత్ - పాక్, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా దేశాల మధ్య సీజ్ ఫైర్ లకు తానే కారణమని చెప్పుకున్నారు!

ఈ విషయంలో భారత్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయినా... ట్రంప్ మాత్రం తన పని తాను చేసుకుపోయారు. ఈ విధంగా నోబెల్‌ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నో ఆశలు పెట్టుకొని, మరెన్నో ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయనకు దక్కలేదు. దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. మరియా కొరినా మచాదో మాట్లాడినట్లు తెలిపారు.

అవును... నోబెల్‌ శాంతి బహుమతి లభించిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోతో మాట్లాడినట్లు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం వైట్‌ హౌస్‌ లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్... నోబెల్‌ బహుమతి పొందిన మరియాతో ఫోన్‌ లో మాట్లాడినట్లు తెలిపారు. మీ గౌరవార్థం నేను దీన్ని అంగీకరిస్తున్నాను అని ఆమె చెప్పినట్లు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... ఈ శాంతి బహుమతికి మీరు కూడా నిజంగా అర్హులు అని ఆమె తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. అలా అని ఆ బహుమతి తనకు ఇచ్చేయమని తాను ఆమెతో అనలేదని చెప్పిన ట్రంప్... విపత్తు సమయంలో వెనిజులాలోని ప్రజలకు ఆమె చాలా సాయం చేశారని.. ఆమెకు తాను తోడుగా ఉన్నానని, ఇకపైనా ఉంటానని పేర్కొన్నారు.

‘ఈ అవార్డు ట్రంప్ కు అంకితం’!:

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన రాజకీయ నాయకురాలు మరియా కొరీనా మచాదోను వరించిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను ఈ పురస్కారం ఇస్తున్నట్లు నార్వే నోబెల్‌ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని.. ఈ క్రమంలో ఆమె ఏడాదిగా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిందని పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన మరియా కొరీనా... ఎన్నో కష్టాలు పడుతున్న వెనిజులా ప్రజలకు, తమ పోరాటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతిస్తున్నారని వెల్లడించారు. అమెరికా, లాటిన్‌ అమెరికా ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం ట్రంప్‌ పై ఆధారపడి ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తనకు దక్కిన ఈ అవార్డును ట్రంప్‌ కు అంకితమిస్తున్నట్లు మచాదో పేర్కొన్నారు.

Tags:    

Similar News