జిన్ పింగ్ స్మార్ట్ అన్న ట్రంప్.. వైట్ హౌస్ ఎక్స్ పోస్టులపై సెటైర్లు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన వ్యక్తి అని, ఆయన తన దేశాన్ని ఎంతో ప్రేమిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు;
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన వ్యక్తి అని, ఆయన తన దేశాన్ని ఎంతో ప్రేమిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ప్రస్తుతం చైనా దిగుమతులపై 125 శాతం టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. సుంకాలను పరిష్కరించుకునేందుకు బీజింగ్ త్వరలోనే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించి కూడా తెలుసు. ఈ సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ పేర్కొన్నారు.
అంతకుముందు, ట్రంప్ పలు దేశాలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, చైనాపై మాత్రం టారిఫ్‌ల విషయంలో ఆయన వెనక్కి తగ్గలేదు. తొలుత డ్రాగన్ దిగుమతులపై ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్, చైనాకు డెడ్‌లైన్ విధించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 100 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి స్పందించిన బీజింగ్, అమెరికా ఉత్పత్తులపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ తాజాగా మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను చైనాపై విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా, ప్రతీకార సుంకాలను విధిస్తూ ప్రపంచ దేశాలను ఒత్తిడికి గురిచేసిన ట్రంప్, చైనా మినహా ఇతర దేశాలకు టారిఫ్‌లపై కొంత ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ "ఆయన పనిని ఆయనను చేసుకోనివ్వండి" అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరు యూజర్లు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. ఒక యూజర్ ట్రంప్ కుమారుడు బారన్ ఈ ఖాతాను నడుపుతున్నాడని అనుమానం వ్యక్తం చేయగా, మరొక యూజర్ ట్రంప్ మనవళ్లు హ్యాండిల్ చేస్తున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.