అర్థమైందా? ట్రంప్ మాట..భారత్ చేతిలో పాక్ ప్రధాని చనిపోయేవాడే!
ఇంగ్లిష్ వ్యాక్యాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి..! మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వారి ఇంగ్లిష్ ను ఆదరాబాదరగా చదివేసి, అంతా అర్థమైనట్లు చెప్పేస్తే లేదా రాసేస్తే అనర్థాలు జరుగుతాయి.;
ఇంగ్లిష్ వ్యాక్యాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి..! మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాల వారి ఇంగ్లిష్ ను ఆదరాబాదరగా చదివేసి, అంతా అర్థమైనట్లు చెప్పేస్తే లేదా రాసేస్తే అనర్థాలు జరుగుతాయి. ఇలాంటి ఉదాహరణలను టీచర్లు పాఠాలుగా చెబుతుంటారు కూడా..! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యల కారణంగా. 2025 జనవరిలో తాను అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపాను అనేది ఆయన తరచూ చెప్పుకొనే గొప్పలు. ఓసారి 8.25 యుద్ధాలను కూడా ఆపానని అన్నారు. ఆ పావు యుద్ధం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల గురించి ట్రంప్ నోరు జారారు. అణుశక్తి దేశాలైన ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ భుజాలు చరుచుకున్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాక, ఎవరి (మూడో వ్యక్తి) ప్రమేయం లేకుండానే యుద్ధం ఆగిందని భారత్ చెబుతుంటే...ట్రంప్ మాత్రం అది తన ఘనతే అంటున్నాడు. అదే మాటను మళ్లీ అన్నాడు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన పదాలను సరిగా గమనించకపోవడంతో అవి తీవ్రమైన భావానికి దారితీశాయి.
ఫుల్ స్టాప్ లు, కామాలు చూసుకోవాలి
అమెరికా చట్టసభ కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ లో ట్రంప్ ప్రసంగిస్తూ, మధ్యలో యుద్ధాల పాయింట్ ను లేవనెత్తారు. పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమం అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వాయిదా సహా అనేక చర్యలు చకచకా జరిగాయి. ఆ ఉద్రిక్తతలను ట్రంప్ ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ ప్రధాని చెప్పారు.. నేను కల్పించుకోకుంటే 35 కోట్ల మంది మా ప్రజలు చనిపోయేవారని అన్నారు. కానీ, ఈ మాటను ట్రంప్ ఎక్కడా గ్యాప్ లేకుండా ఏకధాటిగా చెప్పారు. అది కాస్త, నేను లేకపోతే షెహబాజ్ చనిపోయేవారని 35 కోట్ల మంది చెప్పారు అనే అర్ధంలో వినిపించింది. ఇది చివరకు పెను దుమారం రేపింది.
యుద్ధం ఎందుకు ఆగింది..?
గత ఏడాది ఏప్రిల్ లో పెహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను సమూలంగా నాశనం చేసింది. అయితే, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాల నేపథ్యంలో ప్రపంచంలో మరో యుద్ధం తప్పదా? అనే ఆందోళన వ్యక్తమైంది. కానీ, భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరించి వెనక్కుతగ్గింది. దీంతో ఉద్రిక్తతలు చల్లారాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ అనేది నిరంతర ప్రక్రియ అని తనదైన శైలిలో పాక్ ను హెచ్చరించింది. అంటే, దీనిలో లోతైన అర్థం.. భారత్ లో ఎప్పుడు ఉగ్రవాద చర్యలు జరిగినా పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపడతామని. భారత్ కూడా.. తామే స్వయంగా కాల్పుల విరమణ ఆపామని, మూడో వ్యక్తి జోక్యం లేదని చెప్పింది. వాస్తవం ఇది కాగా, ట్రంప్ మాత్రం తానే యుద్ధాన్ని ఆపానని జబ్బలు చరుచుకుంటున్నారు. కాగా, తన మాట వినకపోతే 200 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతోనే భారత్-పాక్ వెనక్కు తగ్గాయని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ట్రంప్ ఏప్రిల్ (ఆపరేషన్ సిందూర్) తర్వాత కూడా భారత్ పై భారీగా 50 శాతం సుంకాలు విధించారు.