దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులపై పీచేముడ్

అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా కొత్త సంకేతాలు ఇచ్చారు.;

Update: 2025-09-15 12:30 GMT

అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా కొత్త సంకేతాలు ఇచ్చారు. జార్జియాలో హ్యుందాయ్‌ ప్లాంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో, ట్రంప్ స్పందించారు.

“అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతుంటారు. కొంతకాలం ఆ ఉద్యోగులను మా దేశానికి తెచ్చుకోవాలి. మా కార్మికులు వారినుంచి నేర్చుకొని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణిస్తారు” అని ట్రంప్‌ ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పెట్టుబడులపై వెనుకడుతామన్న హెచ్చరికల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

*ఇండియాతోనూ చెలిమికి ట్రంప్.. మనసు మారింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సంబంధాలు గత కొన్ని నెలల్లో ఊహించని మలుపులు తిరిగాయి. ఒకవైపు టారిఫ్‌లు, వాణిజ్య బెదిరింపులు, రష్యన్‌ ఆయిల్‌ దిగుమతులపై ఒత్తిడి.. మరోవైపు ఇండో–పసిఫిక్‌ వ్యూహం, క్వాడ్‌ వంటి వేదికల్లో సహకారం పెరుగుదల. ఈ సమీకరణలు అమెరికా–భారత సంబంధాల్లో కొత్త దిశ చూపుతున్నాయి. ఇండియాతో స్నేహానికి మళ్లీ ట్రంప్ దారులు తెరుస్తున్నారు.

టారిఫ్‌ల బుమరాంగ్‌!

ఆగస్టు 2025లో భారత్‌ నుంచి అమెరికాకు వచ్చే కీలక దిగుమతులపై ట్రంప్‌ 50% టారిఫ్‌ విధించారు. దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందనిపించినా, చివరికి అమెరికానే ఎక్కువ కష్టాల్లో పడింది. భారత్‌ నుంచి వచ్చే చౌక ఔషధాలు, టెక్నాలజీ ఉత్పత్తులు లేకపోవడం అమెరికన్‌ వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు దెబ్బతీసింది. ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లే, ఈ టారిఫ్‌లు అమెరికా అంతర్గత ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచాయి. ట్రంప్‌ స్వయంగా వాణిజ్య ఒప్పందం తప్పనిసరి అని గుర్తించడం ఆయన మొదటి విధానం విఫలమైందని చెప్పడానికి సరిపోతుంది.

మోదీ దౌత్యం.. పట్టుదలతో కూడిన వ్యూహం

మోదీ ఈ ఒత్తిడిని చాణక్యబుద్ధితో ఎదుర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకాకపోవడం ద్వారా అమెరికాకు ఒక క్లారిటీ సందేశం ఇచ్చారు. భారత్‌ రష్యా, చైనాతో పూర్తిగా దగ్గరవదని... మరోవైపు టారిఫ్‌లకు ప్రతిస్పందనగా కొత్త వాణిజ్య మార్గాలు వెతుకుతూ, అమెరికాను ఒంటరిగా వదలకుండా సమతౌల్యం పాటించారు. దీంతో ట్రంప్‌ మొదట ‘టారిఫ్‌ కింగ్‌’ అని విమర్శించిన మోదీని, ఇప్పుడు ‘మంచి స్నేహితుడు’గా పిలుస్తున్నారు. ఇది భారత దౌత్య విజయానికి నిదర్శనం.

* క్వాడ్‌లో కీలక భూమిక

ఇండో–పసిఫిక్‌ భద్రతలో క్వాడ్‌ (భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) ప్రాధాన్యం ఎంతగానో పెరిగింది. మొదట ట్రంప్‌ భారత్‌లో జరగబోయే 2025 చివరి సమావేశానికి రాకపోవచ్చని అనుమానం ఉన్నా, తాజా పరిణామాలు ఆ భయాలను తొలగించాయి. అమెరికా అధికారులు ట్రంప్‌ హాజరుకాబోతున్నారని ధృవీకరించారు. అమెరికా రాయబారి అభ్యర్థి సెర్జియో గోర్‌ వ్యాఖ్యలు కూడా ఇదే సూచిస్తున్నాయి. "క్వాడ్‌ ట్రంప్‌కు అత్యంత ప్రాధాన్యం." ఇది ట్రంప్‌ దృష్టిలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

మొత్తం చూస్తే, ట్రంప్‌ మొదట భారత్‌ను బెదిరింపులతో వశపరచాలని చూశారు. కానీ మోదీ పట్టుదల, వ్యూహాత్మక దౌత్యం పరిస్థితిని తారుమారు చేసింది. టారిఫ్‌లు భారత్‌ను బలహీనపరచలేకపోయినా, అవి అమెరికానే దెబ్బతీశాయి. క్వాడ్‌ వంటి వేదికలు భారత్‌ ప్రాధాన్యాన్ని మరింత స్పష్టంగా చూపించాయి.

ట్రంప్‌ గ్రహించిన అసలు పాఠం ఏమిటంటే.. భారత్‌ను కోల్పోతే, అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహం కూలిపోతుంది. అందుకే ఇప్పుడు ఆయన మోదీతో ‘స్నేహం’ కోసం లెంపలేస్తున్నారు.

Tags:    

Similar News