అమెరికా వలస విధానం: ట్రంప్ మరో కఠిన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలిచింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. అమెరికాలో తల్లిదండ్రులు లేకుండా ఉన్న వలసదారుల పిల్లలు స్వచ్ఛందంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్తే వారికి ఒక్కొక్కరికి $2,500 (సుమారు రూ.2,08,000) రీసెటిల్‌మెంట్ సపోర్ట్ స్టైపెండ్‌గా చెల్లించడానికి ప్రతిపాదించింది. ఈ చర్య అమెరికాలోని వలస విధానంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిలో భాగమని తెలుస్తోంది.
* పథకం వివరాలు
14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల, ఒంటరిగా ఉన్న వలసదారుల పిల్లలు (UAC) ఈ పథకానికి అర్హులు. స్వచ్ఛందంగా అమెరికాను విడిచి వెళ్లడానికి అంగీకరించి, ఇమ్మిగ్రేషన్ జడ్జి దీనిని ఆమోదించిన తర్వాత ఆ పిల్లలు సురక్షితంగా తమ స్వదేశానికి చేరుకున్న తర్వాతే ఈ మొత్తం చెల్లించబడుతుంది.
అక్రమ వలసదారుల సంఖ్యను తగ్గించడం, అలాగే అమెరికా ప్రభుత్వంపై ఉన్న ఇమ్మిగ్రేషన్ కేసుల భారాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇది కేవలం స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇచ్చే ఒక 'చాయిస్' అని వారు సమర్థిస్తున్నారు.
* మినహాయింపులు
మెక్సికోకు చెందిన పిల్లలు ఈ $2,500 స్టైపెండ్‌కు అర్హులు కారు. దీనికి ముందు, ట్రంప్ ప్రభుత్వం అక్రమంగా ఉన్న వయోజన వలసదారులకు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లేందుకు ప్రోత్సహిస్తూ $1,000 స్టైపెండ్‌ను కూడా ప్రకటించింది.
మానవ హక్కుల సంస్థలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న, సున్నితమైన వయస్సులో ఉన్న పిల్లలకు డబ్బు ఆశ చూపించి, వారికి చట్టబద్ధంగా అమెరికాలో రక్షణ పొందే హక్కులను వదులుకునేలా ఒత్తిడి చేయడం "క్రూరమైన వ్యూహం" అని విమర్శిస్తున్నారు.
అకాసియా సెంటర్ ఫర్ జస్టిస్ వంటి సంస్థలు, ఈ చర్య పిల్లల ప్రత్యేక బలహీనతలను.. వారికి ఉన్న చట్టపరమైన హక్కులను చేజార్చుకునేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారు తమ దేశాల్లో ఎదురుచూసే ప్రమాదాల నుంచి రక్షణ కోసమే అమెరికాకు వస్తుండగా.. డబ్బు ఇచ్చి వెనక్కి పంపడం అన్యాయమని వారు వాదిస్తున్నారు.
*ప్రభుత్వ సమర్థన
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) అధికారులు మాత్రం ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ.. ఇది ఒంటరిగా ఉన్న పిల్లలకు (UAC) తమ భవిష్యత్తు గురించి తెలియజేసి, ఒక నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు.
అమెరికా-మెక్సికో సరిహద్దులో అక్రమంగా వస్తున్న వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు మరోసారి దేశీయంగా.. అంతర్జాతీయంగా వలస విధానంపై చర్చను లేవనెత్తి, అమెరికా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.