ట్రంప్ చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిర్బంధం!
ఆదివారం అధ్యక్షుడు ట్రంప్, ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వలస విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యతిరేక నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో వెనక్కి తగ్గడానికి నిరాకరించారు. అమెరికా గడ్డపై అక్రమంగా ప్రవేశించిన వారిని దేశ బహిష్కరణ చేయాలని ఆయన మరింత పట్టుదలతో నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం అధ్యక్షుడు ట్రంప్, ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డెమొక్రాట్ల ఆధ్వర్యంలోని నగరాలలో విస్తృతంగా దేశ బహిష్కరణ చర్యలు చేపట్టాలని, అమెరికా చరిత్రలోనే "అతిపెద్ద సామూహిక నిర్బంధ ప్రోగ్రాం"ను ప్రారంభించాలని ఆదేశించారు. ముఖ్యంగా న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజిలెస్ వంటి ప్రధాన నగరాలలో అక్రమ వలసదారులపై ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) దాడులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం గురించి వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సామూహిక నిర్బంధ కార్యక్రమంలో రోజుకు కనీసం 3,000 మంది వలసదారులను అరెస్ట్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది ట్రంప్ రెండో పదవీకాలం ప్రారంభ దశలో రోజుకు 650 అరెస్టులతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ.
అయితే కొన్ని వర్గాల వారికి ఈ ఆదేశాల నుంచి మినహాయింపు లభించింది. వ్యవసాయ భూములు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న వారిని మాత్రం అరెస్టు చేయరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలపై ఆర్థిక ప్రభావం పడకూడదన్న ఆందోళనల కారణంగా ఈ మినహాయింపు ఇచ్చారు.
ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత నిరసన ప్రదర్శనలు మరింత ఉద్ధృతంగా మారాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన అమెరికన్ ఆర్మీ 250వ వార్షికోత్సవ పరేడ్ సందర్భంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్, లాస్ ఏంజిలెస్‌లలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు.
ఇదే సమయంలో, ట్రంప్ కెనడాలో నిర్వహిస్తున్న గ్రూప్ ఆఫ్ 7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం జరిగింది. లాస్ ఏంజిలెస్‌లో శాంతియుత నిరసనల కోసం నేషనల్ గార్డ్ దళాలను ఏర్పాటు చేసినందుకు తనకే క్రెడిట్ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ తాజా ఆదేశాలతో అమెరికాలో వలసదారుల భవిష్యత్తు మరోమారు ప్రశ్నార్థకంగా మారింది. ఇది దేశీయ రాజకీయాల్లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.