ఏడోసారి... భారత్ – పాక్ విషయంలో ట్రంప్ స్వోత్కర్ష పీక్స్!
మన సక్సెస్ గురించి మనం మాట్లాడుకోవడం కంటే.. ప్రపంచం మాట్లాడుకుంటే, ప్రపంచం హర్షిస్తే అది గొప్ప విజయం అని అంటారు చాలా మంది!;
మన సక్సెస్ గురించి మనం మాట్లాడుకోవడం కంటే.. ప్రపంచం మాట్లాడుకుంటే, ప్రపంచం హర్షిస్తే అది గొప్ప విజయం అని అంటారు చాలా మంది! అయితే.. ట్రంప్ సాధించినట్లు చెప్పుకుంటున్న విజయాన్ని కనీసం 100 కోట్ల మంది వరకూ హర్షించడం లేదని అంటున్న వేళ... ట్రంప్ మాత్రం తాను చేసినట్లు చెప్పుకున్న పనిని.. పదే పదే అంతర్జాతీయ వేదికలపై చెప్పుకుంటున్నారు.
అవును... దేశం ఏదైనా.. వేదిక మరేదైనా.. సందర్భం, సమయం ఏదైనప్పటికీ... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, అది పూర్తిగా తన గొప్పతనం, తన మధ్యవర్తిత్వ చాణక్యం అని చెప్పుకుంటున్నారు ట్రంప్. దీనిపై ఇప్పటివరకూ భారత్ మాట్లాడకపోయినా.. కాల్పుల విరమణకు మాత్రం తానే కారణం అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా... భారత్ – పాక్ మధ్య ఆగ్రహావేశాల స్థాయి మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ సమయంలో.. రెండు దేశాల కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వ నడపడం తన పెద్ద విజయమని అభివర్ణించారు. గల్ఫ్ లో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని వాషింగ్టన్ ప్రయాణమవుతున్న ఆయన.. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా... తాను చేశానని చెప్పుకోవడం కాదు కానీ.. భారత్ - పాక్ మధ్య గతవారం తలెత్తిన సమస్య తీవ్రతరం కాకుండా సద్దుమణగడానికి సాయం చేశానని.. ఎన్నేళ్లు ఈ సమస్యపై పోరాటం చేస్తారు? తాను ఏ సమస్యనైనా పరిష్కరించగలను.. వారిని కలిపి ఆ సమస్యను పరిష్కరిస్తాను! అంటూ మరోసారి పరోక్షంగా కాశ్మీర్ సమస్యను ప్రస్థావించారు ట్రంప్! దీంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి... భారత్ - పాక్ మధ్య ఉన్న సమస్య కాశ్మీర్ ఒకటే కాదు! ఉగ్రవాదం కూడా అతిపెద్ద సమస్య అనేది ట్రంప్ గ్రహించాలి! ఆపరేషన్ సిందూర్ తో భారత్ చేసిన దాడులు తొలుత ఉగ్రవాదులపైనే అని ట్రంప్ కి తెలియాలి. ఆ దాడుల అనంతరం.. వారి శవపేటికలపై జాతీయ జెండాలు కప్పి అంత్యక్రియల్లో ఆర్మీ, పోలీసు పాల్గొంది పాక్ లో అనే విషయం ట్రంప్ కి ఇప్పటికైనా తెలియాలి!
మరోపక్క భారత్ దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిరాల పునర్నిర్మాణానికి పాకిస్థాన్ కోట్ల రూపాయలు కేటాయిస్తుందన్న విషయం తెలుసుకోవడానికి ట్రంప్ కు నిఘా సమాచారం అవసరం లేదు.. పత్రికలు చూస్తే చాలు! అందువల్ల... పాక్ కు ట్రంప్ అయినా ఎవరైనా ఏ చిన్న సహాయం చేసినా, ఆ దేశాన్ని కాపాడేయాలని ఎలాంటి ప్రయత్నం చేసినా.. అది ఉగ్రవాదులకు ఆయుస్సును పెంచడమే, వారి విస్తరణను ప్రోత్సహించడమే అని గ్రహించాలి!
ఈ విషయం తెలియకో.. లేక, పాక్ తో ఏదైనా తెరవెనుక అండర్ స్టాండింగ్ ఉందనే ప్రచారమే నిజమో తెలియదు కానీ... భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం నడపడం తన విజయమని గత వారం రోజుల్లో ఏడోసారి చెప్పుకున్నారు ట్రంప్!
కూర్చుని మాట్లాడుకుందాం..: పాక్ ప్రధాని!
భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చింది పాక్ సైన్యం అని చెబుతూ.. తమ సైనికులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పాటించిన "యెమ్-ఏ-తశక్కర్" ముగింపు సందర్భంగా ఇస్లామాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా... భారత్ - పాక్ లు చర్చలకు కూర్చొని జమ్మూ-కశ్మీర్ సహా అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు.
ఇదే సమయంలో... భారత్ – పాకిస్థాన్ లు ఇప్పటివరకూ మూడు యుద్ధాలు చేశాయని.. కానీ, ఏమీ సాధించలేకపోయాయని.. ప్రశాంతంగా కూర్చొని చర్చిస్తే అన్నింటినీ పరిష్కరించుకోవాలని ఈ పాఠం మనకు నేర్పుతుందని అన్నారు. ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ సహకరించుకోవచ్చని ఆయన చెప్పడం గమనార్హం!