పుతిన్ మంట.. రగిలిపోతున్న ట్రంప్
ఉక్రెయిన్–రష్యా యుద్ధం మరింత సంక్లిష్ట దశలోకి ప్రవేశించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం;
ఉక్రెయిన్–రష్యా యుద్ధం మరింత సంక్లిష్ట దశలోకి ప్రవేశించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాను సంతోషంగా లేనని ఆయన స్పష్టం చేశారు. రష్యా–ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీల మధ్య శాంతి చర్చలు జరిపించడం చాలా కష్టమైన పని అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘నూనె, వెనిగర్‌లను కలపడం లాంటిదే ఈ ప్రక్రియ’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రెండు వారాల్లో పుతిన్, జెలెన్‌స్కీ వైఖరిని సమీక్షిస్తానని, అప్పటికీ శాంతి ఒప్పందం కుదరకపోతే తానే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆ నిర్ణయం భారీ ఆంక్షల రూపంలోనా.. లేక సుంకాల రూపంలోనా ఉంటుందో తరువాత ప్రకటిస్తానని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఉక్రెయిన్‌లోని అమెరికా సంస్థలపై దాడి జరిపిన విషయంపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు కొనసాగితే మాస్కోకు మరింత గట్టి ఆంక్షలు తప్పవని ఆయన అన్నారు.
-ఫర్నీచర్ దిగుమతులపై సుంకాల పరిశీలన
అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, ఆర్థిక రంగంలో కూడా దూకుడు చూపిస్తున్నారు. అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఫర్నీచర్‌పై భారీ సుంకాలు విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ‘‘మేము ఫర్నీచర్ దిగుమతులపై సుంకాల విధింపు అంశంపై దర్యాప్తు ప్రారంభించాం. 50 రోజుల్లో విచారణ పూర్తవుతుంది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అయితే సుంకాల శాతం ఎంతమేరకు ఉంటుందన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు.నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్‌లలో తిరిగి ఫర్నీచర్ పరిశ్రమకు ఊపునిచ్చేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని ట్రంప్ వివరించారు.
పుతిన్ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమైతే భారీ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అంతర్గత పరిశ్రమలకు మద్దతుగా దిగుమతులపై సుంకాలు విధించే ప్రయత్నాలు ప్రారంభించారు. అంతర్జాతీయ, ఆర్థిక రంగాలలో ట్రంప్ కొత్త దూకుడు రాబోయే రోజుల్లో మరిన్ని పరిణామాలకు దారితీయనుంది.