సినిమాలకే సినిమా చూపించిన ట్రంప్.. షాకింగ్ డెసిషన్
Trump’s 100% Tariff Shock on Foreign Films: Big Jolt to Indian Cinema Exports;
``బాహుబలి` అమెరికాలోనూ వందల కోట్లు రాబట్టింది.. `పుష్ప` సూపర్ డూపర్ విజయవంతమైంది.. భారీ ఎత్తున డాలర్లు పోగేసుకుంది`` - ఇవి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వినిపించిన వ్యాఖ్యలు. ఆయా సినిమాలు అగ్రరాజ్యంలో సాధించిన కలెక్షన్లు. కానీ, ఇకపై అలా కుదరదు!. ఎందుకంటే.. ఇప్పుడు ట్రంప్ విజృంభించారు. తనదైన శైలిలో సుంకాలను విధించి ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కంపెనీలను కూడా హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా సినిమాలకే సినిమా చూపించారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.
ఏంటా నిర్ణయం..
అమెరికాలో నిర్మించే సినిమాలపై విధించే సుంకాలపై 50 శాతం రాయితీ ఇస్తామని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో అందరూ సంబర పడ్డారు. అయితే.. తాజాగా ఆయన విదేశాల్లో నిర్మించి.. అమెరికాలో ప్రదర్శించే సినిమాలపై మాత్రం కొరడా ఝళిపించారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం టారిఫ్(సుంకాలు) విధిస్తున్నట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. తద్వారాఅమెరికా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటు న్న అతి పెద్ద `పీడ` విరగడవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
గవర్నర్‌పై చిందులు!
ముఖ్యంగా కాలిఫోర్నియా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుతో ఇక్కడి చిత్ర పరిశ్రమ అడుక్కునే స్థాయికి చేరిందని ట్రంప్ చిందులు తొక్కారు. వాస్తవానికి కాలిఫోర్నియా ఒకప్పుడు.. అందాలకు చిరునామా. ఇక్కడ ఎక్కువగా చిత్రాలు నిర్మాణం అయ్యేవి. అయితే.. పెరిగిపోయిన ఖర్చులతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు.. ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. అక్కడ చిత్రీకరించి.. అమెరికాలో విడుదల చేస్తున్నారు. ఇక, ఇతర దేశాలకు చెందిన అగ్రదర్శకులు, నిర్మాతలు కూడా తమసినిమాలను డబ్బింగ్ చేసి.. అమెరికాలో విడుదల చేస్తున్నారు. నేరుగా దేశీయ భాషల్లో విడుదలయ్యే సినిమాలు కూడా ఉన్నాయి. అయితే..ఇ ప్పుడు ఈ ఆటలు సాగబోవని.. గవర్నర్ వెధవ(స్టుపిడ్ డెసిషన్) నిర్ణయాలు తీసుకున్నారని.. ట్రంప్ నిప్పులు చెరిగారు.
ఏం జరుగుతుంది?
సాధారణంగా భారతీయ చలన చిత్ర రంగం విదేశాల నుంచి కూడా ఇటీవల కాలంలో ఆర్జిస్తోంది. పలు ప్రముఖ చిత్రాలను విదేశాల్లోనూ విడుదల చేసి నిర్మాతలు లాభిస్తున్నారు. అయితే.. ఇప్పుడు 100 శాతం సుంకాలు విధిస్తే.. ఆ ప్రభావం చిత్రాలపై పడుతుంది. తద్వారా టికెట్ ధరలను రెట్టింపు లేదా.. మూడు రెట్లు అయినా చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే.. సగటు అమెరికన్ ప్రేక్షకుడు.. స్థానికంగా నిర్మించిన చిత్రాల వైపే మొగ్గుతాడు.. అనేది ట్రంప్ ఆలోచన. కానీ, ఇప్పటికే ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాలపై విమర్శలు వస్తుండడం గమనార్హం. తమకు చిన్న పాటి ఆనందాన్ని కూడా లేకుండా చేస్తున్నాడంటూ.. అధ్యక్షుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.