ఆటో పరిశ్రమకు ఊరటనిచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమ పట్ల తన వైఖరిని కొంచెం మెత్తబరుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా మీడియా వర్గాల కథనాలు వెలువరించాయి;

Update: 2025-04-30 00:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమ పట్ల తన వైఖరిని కొంచెం మెత్తబరుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా మీడియా వర్గాల కథనాలు వెలువరించాయి. తన పాలనలో తొలి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డెట్రాయిట్‌లో ర్యాలీ నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా పత్రికల కథనాల ప్రకారం, ప్రస్తుతం కార్లను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలు చెల్లించాల్సిన 25 శాతం పన్ను యథాతథంగా ఉంటుంది. అయితే దీనితో పాటుగా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై విధించే ఇతర సుంకాల నుంచి కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 3వ తేదీ నుంచి విధించాల్సి ఉన్న విదేశీ ఆటోమొబైల్‌ విడిభాగాల చెల్లింపులకు కూడా ట్రంప్‌ కార్యవర్గం అనుమతిస్తోంది.

ట్రంప్‌ సుంకాల యుద్ధంలో తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో ఆటోమొబైల్‌ కూడా ఒకటి. ముఖ్యంగా మెక్సికో, కెనడా వంటి పొరుగు దేశాల నుంచి దిగుమతులు అసాధ్యంగా మారిపోయాయి. డెట్రాయిట్‌కు చెందిన అనేక కార్ల తయారీదారులకు ఈ దేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ట్రంప్‌ తన మొదటి విడత పాలన సమయంలో నార్త్‌ అమెరికా ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌పై చర్చలు జరపడం వల్ల వారు తమ పెట్టుబడులను కొనసాగించగలిగారు. అయితే, సుంకాల భారం వల్ల కార్ల ధరలు పెరిగి, విక్రయాలు దెబ్బతింటాయనే భయాలు పరిశ్రమను వెంటాడాయి.

అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ మాట్లాడుతూ, కీలక భాగస్వామ్యాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారని వాల్‌స్ట్రీట్‌ వెల్లడించింది. దేశీయ కంపెనీలను ప్రోత్సహించేందుకు ట్రంప్‌ కుదుర్చుకోబోయే డీల్‌ ఆయన వాణిజ్య విధానానికి పెద్ద విజయంగా నిలుస్తుందని, దేశీయంగా కార్ల తయారీకి అవసరమైన మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. అమెరికా ఆటోమొబైల్‌ పరిశ్రమ ఈ తాజా మార్పులను స్వాగతించింది.

Tags:    

Similar News