భారీ సుంకం దెబ్బ సిద్ధం...'యాపిల్' కు ట్రంప్ మార్క్ బెదిరింపు!

తన మాట వినని దేశాలను, తాను చెప్పినట్లు నడుచుకోని రాజ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో బెదిరిస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-05-23 14:33 GMT

తన మాట వినని దేశాలను, తాను చెప్పినట్లు నడుచుకోని రాజ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో బెదిరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలు దేశాలకు స్వానుభవం అయ్యింది. అయితే.. ఈ విషయంలో చైనా అయినా ఒకటే ట్రీట్ మెంట్, యాపిల్ కి అయిన అదే ట్రీట్ మెంట్ అన్నట్లుగా స్పందింస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

అవును... అవును తన దేశంలోని సంస్థ అయినా, పక్క దేశంలోని ప్రభుత్వం అయినా తన మాట వినకపోతే సుంకాలతో బెదిరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దాన్ని పలువురు అనధికారిక నియంతృత్వ పోకడ అని అంటే.. ఆయన మాత్రం "అమెరికా ఫస్ట్", "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో "యాపిల్" సంస్థను మరోసారి హెచ్చరించారు.

ఈ క్రమంలో తన సోషల్ మీడియా 'ట్రూత్' లో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... అమెరికాలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్ లోనే తయారు చేయాలని.. భారత్ లో కానీ మరో దేశంలో కానీ కాదనే విషయం టిమ్ కుక్ కు ఇది వరకే తెలియజేశామని.. అలా కుదరదని అంటే మాత్రం కనీసం 25% సుంకాన్ని అమెరికాకు యాపిల్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

కాగా.. చైనాపై అమెరికా భారీ సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్ లో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల స్పందించిన ట్రంప్... తనకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఎదురైందని.. అతడు భారత్ లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని.. అలా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పానని అన్నారు.

ఖతార్ పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. బెదిరింపులకు దిగారు! అమెరికాలో కాకుండా మరోచోట తయారుచేసే ఐఫోన్లపై 25% సుంకాలు చెల్లించాలని హెచ్చరించారు! వెంటనే.. యాపిల్ షేర్ విలువ 3% పతనమైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News