భారత్ పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్ విస్తరించొద్దని పిలుపు
నువ్వేమీ కంపెనీలు నిర్మించాల్సిన అవసరం లేదు. అమెరికా మీద దృష్టి పెట్టండి" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సదరు కథనాల్లో పేర్కొన్నారు.;
దోహా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌తో భారత్‌లో యాపిల్ కార్యకలాపాల విస్తరణపై పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారత్‌పై తనకున్న అక్కసును ఈ సందర్భంగా ట్రంప్ బయటపెట్టినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
దోహాలో జరిగిన ఒక బిజినెస్ ఈవెంట్‌లో ట్రంప్ మాట్లాడుతూ, యాపిల్ సంస్థ భారత్‌లో విస్తరించడాన్ని తాను కోరుకోవడం లేదని, అమెరికాపై దృష్టి సారించాలని టిమ్ కుక్‌కు సూచించినట్లు తెలిపారు. "ప్రపంచంలోనే ఇండియా హై టారిఫ్స్ కలిగిన దేశం. అమెరికా ఉత్పత్తులపై ఎలాంటి సుంకం విధించమని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్ వాళ్లని వాళ్లు చూసుకోగలరు. నువ్వేమీ కంపెనీలు నిర్మించాల్సిన అవసరం లేదు. అమెరికా మీద దృష్టి పెట్టండి" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సదరు కథనాల్లో పేర్కొన్నారు.
భారత్‌లో అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ గతంలోనూ చాలాసార్లు విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో యాపిల్ వంటి అమెరికన్ కంపెనీలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని విస్తరించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యాపిల్ ఇటీవలి కాలంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, భారత్‌లో తన ఉత్పత్తిని గణనీయంగా పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అయితే, భారత్ తమ ఉత్పత్తులపై ఎటువంటి సుంకం విధించమని అమెరికాకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ప్రస్తుతం యాపిల్ తన తయారీని భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఫోన్‌ల ఉత్పత్తిని పెంచుతూ, ఎగుమతులకు భారత్‌ను కీలక కేంద్రంగా మారుస్తోంది. ఈ సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.
-ఇండియాలో ఇప్పటికే విస్తరణ బాట పట్టిన యాపిల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలో పెట్టుబడులు విస్తరించవద్దని చెప్పినప్పటికీ ఆపిల్ ఇప్పటికే తన కార్యకలాపాలను నిశ్శబ్దంగా పెంచుకుంటోంది. మార్చిలో ఆపిల్ భారతదేశం నుండి అమెరికాకు 600 టన్నుల ఐఫోన్‌లను, వీటి విలువ 2 బిలియన్ డాలర్లు రవాణా చేసింది. ఇది దాని స్థానిక తయారీ భాగస్వాములైన టాటా - ఫాక్స్‌కాన్ లు అందించిన రికార్డు స్థాయి ఫోన్లు. ముఖ్యంగా ఒక్క ఫాక్స్‌కాన్ మాత్రమే 1.3 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను అందించింది అని రాయిటర్స్ నివేదించింది.
అయితే, భారతదేశంలో ఐఫోన్‌లను తయారు చేయడానికి అదనపు ఖర్చు అవుతుంది. చైనా కంటే ఉత్పత్తి ఖర్చులు 5–8% ఎక్కువగా ఉంటాయని, కొన్ని సందర్భాల్లో 10% వరకు పెరగవచ్చని రాయిటర్స్ పేర్కొంది. అయినప్పటికీ చైనాతో వాణిజ్య విధానంలో భవిష్యత్ నష్టాలను తగ్గించడానికి ఈ మార్పు ఒక లెక్కగట్టిన చర్యగా అనిపిస్తుంది.
ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం భారతదేశం నుండి దిగుమతులపై 26% సుంకాన్ని విధించింది - ఇది చైనా వస్తువులపై విధించిన 100% పైగా సుంకంతో పోలిస్తే చాలా తక్కువ. వాషింగ్టన్ అప్పటి నుండి చైనాను మినహాయించి, ఆ సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేసింది.
ట్రంప్ అమెరికన్ తయారీని తిరిగి దేశంలోకి తీసుకురావాలని గట్టిగా చెబుతున్నప్పటికీ, ఆపిల్ యొక్క గ్లోబల్ సప్లై చైన్ నిర్ణయాలు రాజకీయ ఒత్తిడి, వ్యయ సామర్థ్యం మరియు మార్కెట్ యాక్సెస్ మధ్య సమతుల్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.