చర్చలు విఫలం.. టాలీవుడ్ లో సమ్మె కొనసాగింపు
30 శాతం వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తూ ఇటీవల బంద్ కు పిలుపునిచ్చింది ఫిలిం ఫెడరేషన్. దీంతో షూటింగ్ లకు వెళ్లడం లేదు కార్మికులు;
టాలీవుడ్ లో సినీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 30 శాతం వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తూ ఇటీవల బంద్ కు పిలుపునిచ్చింది ఫిలిం ఫెడరేషన్. దీంతో షూటింగ్ లకు వెళ్లడం లేదు కార్మికులు. అదే సమయంలో ఫిలిం ఛాంబర్ కూడా అన్ని సినిమాల చిత్రీకరణలు నిలిపివేయాలని ఆదేశించింది.
దీంతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. అయితే సమ్మె విషయంపై ఇప్పటికే నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగ్గా.. అవి విఫలమయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించడం లేదు. అయితే నేడు మరోసారి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు.. నిర్మాతలను కలిశారు. దీంతో సమ్మె కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు.
సమ్మె సమస్యను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపి.. వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకు వస్తారని అంతా అభిప్రాయపడ్డారు. కానీ సినీ పరిశ్రమలో మళ్ళీ నిరాశ పూరితమైన వాతావరణం నెలకొంది. మరోసారి చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు ప్రతిపాదించిన వర్కింగ్ కండీషన్స్ లో ఒక్క దానికి కూడా కార్మికుల యూనియన్లు అంగీకరించడం లేదు.
నిర్మాతల ప్రతిపాదనలకు తోసిపుచ్చుతున్నారు ఫెడరేషన్ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు. దీంతో సమ్మె ఇంకా కొనసాగనుంది. 2000 రూపాయల లోపు ఉండే వర్కర్స్ కు వేతనం పెంపునకు అంగీకరించారు నిర్మాతలు. కానీ అధిక వేతనాలు తీసుకునే వారికి కూడా తప్పని సరిగా పెంచాలని కొన్ని యూనియన్లు పట్టుబట్టాయి. దానికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం అని చెప్పిన నిర్మాతలు తేల్చిచెప్పారు. అదే సమయంలో తమకు అనుకూలంగా కొన్ని వర్కింగ్ కండీషన్స్ ను నిర్మాతలు ప్రస్తావించగా.. అవి కూడా తాము చేయమని యూనియన్లు పెద్దలు చెప్పారు. ఇప్పటికీ 10 రోజులుగా సమ్మె కొనసాగుతుండగా.. కొందరు కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన నేటి సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఛాంబర్‌లో ఇరు వర్గాల మధ్య చర్చలు వాడీవేడీగా జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చర్చలు విఫలమవడంతో సినీ కార్మికుల సమ్మె ఇంకొంతకాలం కొనసాగేలా కనిపిస్తుంది. మరి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి.