త్రిపురలో 822 ఓట్లు తెచ్చుకున్న పార్టీకి బెంగాల్ లో 20 మంది ఎంపీలు.. ఏంటీ ట్విస్టు..?!

పశ్చిమబెంగాల్ కు చెందిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Update: 2026-06-15 06:34 GMT

పశ్చిమబెంగాల్ కు చెందిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఈ ఎంపీలు పార్లమెంటులో తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అంతేకాకుండా తాము 20 మంది కలిసి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనే ప్రాంతీయ పార్టీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో 20 మంది ఎంపీలు చేరుతున్న ఎన్సీపీఐ పార్టీ చరిత్ర తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. కోల్ కతా కేంద్రంగా పనిచేస్తున్న ఈ పార్టీ 2023లొ త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందని అంటున్నారు. ఆ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో పోటీచేయగా, మూడుచోట్ల నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని ఈసీ లెక్కలు బయటపెట్టాయి. ఇక నాలుగు చోట్ల కలిపి ఎన్సీపీఐకి కేవలం 822 ఓట్లు వచ్చాయని అంటున్నారు.

తృణమూల్ తిరుగుబాటు ఎంపీల నిర్ణయంతో నోటాకన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎన్సీపీఐ ఇప్పుడు దేశంలో ఎక్కువ ఎంపీలు ఉన్న 5వ పెద్ద పార్టీగా ఆవిర్భవించిందని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 240 మంది సభ్యుల బలంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీ తర్వాత కాంగ్రెస్ 99 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, సమాజ్ వాది 37 స్థానాలతో మూడు, తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే తృణమూల్ లో అంతర్గత సంక్షోభంతో 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో కలవడంతో ఆ పార్టీ నాలుగో స్థానం కోల్పోయింది. తృణమూల్ తిరుగుబాటు ఎంపీలు ఎన్సీపీఐలో చేరడంతో ఈ పార్టీకి లోక్ సభలో 20 మంది ఎంపీల బలం సమకూరింది. అయితే డీఎంకే పార్టీకి 22 మంది ఎంపీలు ఉండటంతో ఆ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో గత ఎన్నికల్లో కనీసం పోటీ చేయని ఎన్సీపీఐ ఐదో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు తృణమూల్ తిరుగుబాటు ఎంపీలు తొలుత బీజేపీలో విలీనం అవ్వాలని భావించినా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారందరిపై విమర్శలు గుప్పించి అధికారంలోకి వచ్చిన బీజేపీ వెంటనే పార్టీలో చేర్చుకుంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వెనక్కి తగ్గిందని అంటున్నారు. కొంతకాలం ఎన్సీపీఐలో ఎంపీలను కొనసాగించి ఆ పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్లు భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా తృణమూల్ తిరుగుబాటు ఎంపీల్లో ఒకరిద్దరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక వచ్చేసార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్సీపీఐని బీజేపీలో విలీనం చేసుకునే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రెబల్ గ్రూపులో అత్యంత సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ మీడియాతో మాట్లాడుతూ వారి అసలు వ్యూహాన్ని బయటపెట్టారు.

చట్టపరమైన ఇబ్బందులు రాకూడదనే ప్రస్తుతానికి రిజిస్టర్డ్ పార్టీ అయిన ఎన్సీపీఐలో విలీనం అయ్యామని వెల్లడించారు. జూలైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక 'నిజమైన తృణమూల్ కాంగ్రెస్' పార్టీ అని క్లెయిమ్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, తాజా పరిణామాలపై మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అలర్ట్ అయ్యారు. ఈ చీలిక రాజ్యాంగ విరుద్ధమని, రెబల్స్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం పార్టీలో చీలిక చట్టబద్ధం కాదని వారు వాదిస్తున్నారు.

Tags:    

Similar News