సిసలైన జనసైనికునికి పవన్ బహుమానం !

పవన్ అంటే ఆయనకు భక్తి ఆరాధన. జనసేనలో చేరి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారు.;

Update: 2025-05-12 07:05 GMT

పవన్ అంటే ఆయనకు భక్తి ఆరాధన. జనసేనలో చేరి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారు. ఇక ఎన్నికల్లో టికెట్ కోసం ఆయన ఆశ పడ్డారు. అందులో తప్పు కూడా లేదు. కానీ పొత్తులతో ఆయనకు అవకాశం దక్కకుండా పోయింది. దాంతో ఆయంతో పాటు అభిమానులు కూడా ఎంతో వేదన చెందారు ఆయనే తుమ్మల రామస్వామి. అందరూ ఆయనను బాబు అని అంతా పిలుస్తారు.

తాజాగా టీడీపీ కూటమి నామినేటెడ్ పదవులను పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ని నియామిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మా బాబుకు న్యాయం జరిగింది అని జనసేన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియచేస్తున్నాయి.\

ఇక తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన పార్టీ జ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అలాగే పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జిగా కొనసాగుతున్నారు. బాబు మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానంతో ఉంటూ వస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం లో కూడా యువజన విభాగానికి సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇక జనసేన పార్టీ కష్టకాలంలో ఆయన తన సొంత డబ్బులు ఖర్చు చేసి తాను అతి పెద్ద అండగా నిలిచారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు. అయితే పార్టీకి విధేయకుడిగా ఉంటూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.

అలా పార్టీకి విధేయుడిగా ఉన్న తుమ్మల బాబుకు సముచిత స్థానం కల్పిస్తూ ఆయనను డిసిసిబీ చైర్మన్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన అధినాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవడమే తనకు తెలుసునని ప్రజా సేవకు తన జీవితం అంకితం అన్నారు.

తాను ఎంత ఎదిగినా కార్యకర్తనేనన్నారు. ప్రజలకు ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే తనకు తెలుసు అన్నారు. తనకు అప్పగించిన డీసీసీబీ చైర్మన్ పదవితో రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తానని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధికి చేస్తున్న కృషికి తన వంతు సహాయంగా పనిచేస్తానన్నారు.

ఇదిలా ఉంటే పార్టీ కోసం ఎంతో కృషి చేసిన తుమ్మల బాబుకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని అప్పట్లో జనసైనికులు చాలా కలత చెందారు. ఇక ఆయన కూడా మధన పడ్డారు. అయితే పార్టీని నమ్ముకుని మళ్ళీ తన బాటలో నడచారు. అందుకే నిదానంగా ఉన్నారు కాబట్టే ఈ కీలక పదవి ఆయనకు దక్కింది అని అంతా అంటున్నారు. ఇక పవన్ సైతం అసలైన సిసలైన జనసైనికునికి మంచి పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News