ముత్తంశెట్టికి ఏమైంది? చప్పట్లు కొట్టవేమంటూ వేదికపైనే వార్నింగ్
విశాఖ జిల్లాలోని భీమిలి మండలంలో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.;
మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఎవరేం అనుకుంటారన్న సోయి లేకుండా..ఓపెన్ గా ఆయన చెలరేగిపోయిన వైనంతో విస్తుపోయారు. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు అనుకూలంగా లేని వారి సంగతి చూస్తానంటూ విరుచుకుపడిన ఆయన.. హోల్ సేల్ హెచ్చరికలు ఇచ్చేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ జిల్లాలోని భీమిలి మండలంలో పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన తీరు ఇప్పుడు చర్చగా మారింది. ముఖ్యమంత్రికి.. తనకు అనుకూలంగా లేని వాలంటీర్లను తీసేస్తామన్న ఆయన.. వేదిక మీద ఉన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ సూర్యనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు తెర తీశాయి. ‘‘ఏం .. సూర్య నారాయణ.. చప్పట్లు కొట్టమంటే కొట్టటం లేదు. జగన్ డబ్బులు వేశారన్నా చప్పట్లు రావటం లేదు. అడిగి కొట్టించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేయటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి.
అంతేకాదు.. వాలంటీర్లను ఉద్దేశించి ముత్తంశెట్టి చేసిన వ్యాఖ్యల్ని విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన ముత్తంశెట్టి.. ఈ కార్యక్రమానికి పదకొండు మంది వాలంటీర్లు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ఎంపీడీవో జానకిని ఉద్దేశించి మాట్లాడుతూ.. చూడండి మేడం.. అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనన్నారు.
వేదికపైన ఉన్న ఎంపీపీ వాసురాజు.. జెడ్పీటీసీ సభ్యుడు వెంకటప్పుడు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ యలమంచలి సూర్యనారయణల వైపు చూస్తూ.. ఎవరి వర్గమైనా.. ఏ కులమైనా.. ఎవరి చుట్టమైనా.. ఎవరైనా సరే.. జగన్ కు, పార్టీకి, నాకు అనుకూలమైన వాళ్లే ఉంటారని.. లేనోళ్లను పీకేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు విస్తుపోయేలా చేశాయి. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ముత్తంశెట్టి వైఖరి సరిగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.