ఉత్తరకొరియా సింహాసనం రేసు : మరో 'రక్తచరిత్ర' తప్పదా?

కానీ ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే ఆ రహస్య కోటలో ఒక కొత్త ‘వారసత్వ యుద్ధం’ మొదలైనట్లు కనిపిస్తోంది.;

Update: 2026-02-17 05:59 GMT

ఉత్తర కొరియా రాజకీయాలు ఎప్పుడూ ఒక అంతుచిక్కని రహస్యమే. కానీ ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే ఆ రహస్య కోటలో ఒక కొత్త ‘వారసత్వ యుద్ధం’ మొదలైనట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు ఏ , ఆయన సోదరి కిమ్ యో జోంగ్ మధ్య అధికారం కోసం ఒక నిశ్శబ్ద పోరు నడుస్తోందనేది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అంచనా.

ప్రపంచ గమనాన్ని శాసించగల అణ్వాయుధాలు ఒకవైపు.. బయటి ప్రపంచానికి తెలియని అత్యంత కఠినమైన నియంతృత్వ పాలన మరోవైపు. ఇదీ ఉత్తర కొరియా ముఖచిత్రం. అయితే ఇప్పుడు ఈ దేశం ఒక చారిత్రక మలుపులో నిలబడింది. కిమ్ కుటుంబంలో మూడో తరం నుంచి నాలుగో తరానికి అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమైందా? అన్న సందేహాలకు బలం చేకూరుస్తూ కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అయితే ఈ పరిచయం వెనుక ఒక బలమైన రాజకీయ ముప్పు పొంచి ఉందనేది వాస్తవం.

వారసురాలిగా ‘జు ఏ’.. సంకేతమా? హెచ్చరికా?

గత రెండేళ్లుగా కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏని ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలోనూ వెంటే ఉంచుకుంటున్నారు. కేవలం క్షిపణి ప్రయోగాలు, మిలిటరీ పరేడ్‌లే కాకుండా ఇటీవల చైనా పర్యటనలో కూడా ఆమె కనిపించడం విశేషం. దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) నివేదిక ప్రకారం, ఆమె ఇప్పుడు కేవలం ‘వారసత్వ శిక్షణ’లో లేదు.. ఏకంగా ‘సక్సెసర్ డిజిగ్నేట్’ కి చేరుకుంది. పాలసీ విషయాల్లో కూడా ఆమె జోక్యం చేసుకుంటున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

అత్త కిమ్ యో జోంగ్: అసలైన సవాల్!

మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఇప్పటికీ దేశంలో రెండో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. పార్టీలో, సైన్యంలో ఆమెకు అపారమైన అనుభవం, పట్టు ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ అస్వస్థతకు గురైన సమయంలో దేశాన్ని నడిపించిన ఘనత ఆమెది. 38 ఏళ్ల వయసులో పూర్తి రాజకీయ పరిణితి ఉన్న యో జోంగ్, ఒక టీనేజ్ అమ్మాయి అయిన తన మేనకోడలు నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్‌కు ఏదైనా జరిగితే సైన్యం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అనుభవం ఉన్న అత్త వైపునా లేక వారసురాలిగా ముద్రపడిన కోడలి వైపునా? అన్నది చూడాలి.

రక్తచరిత్ర పునరావృతమవుతుందా?

కిమ్ కుటుంబ చరిత్ర అంత సున్నితమైనదేమీ కాదు. తన బాబాయ్ జాంగ్ సోంగ్ థేక్‌ను ‘ద్రోహి’గా ముద్రవేసి ఉరితీసినా తన అన్న కిమ్ జోంగ్ నామ్‌ను విదేశీ గడ్డపై రసాయన దాడితో అంతం చేసినా.. అది కేవలం కిమ్ జోంగ్ ఉన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికే... "ఉత్తర కొరియా లాంటి పురుషాధిక్య సమాజంలో ఒక మహిళా నేతను అంగీకరించడమే కష్టం. అటువంటిది ఇద్దరు శక్తిమంతమైన మహిళల మధ్య పోరు వస్తే, అది తీవ్రమైన అంతర్గత సంక్షోభానికి దారితీయొచ్చు.

ప్రపంచం ఎందుకు భయపడుతోంది?

ఈ ‘అత్తా-కోడళ్ల’ పోరు కేవలం ఒక కుటుంబ కలహం కాదు. ఉత్తర కొరియాలో తలెత్తే ఏ చిన్న అస్థిరత అయినా సరే ఆ దేశంలోని అణ్వాయుధాల నియంత్రణపై ప్రభావం చూపుతుంది. ఈ నెలాఖరులో జరగనున్న ‘వర్కర్స్ పార్టీ కాంగ్రెస్’ సమావేశాల్లో కిమ్ జు ఏకి ఏదైనా అధికారిక హోదా ఇస్తారా? లేదా కిమ్ యో జోంగ్ ప్రాధాన్యతను తగ్గిస్తారా? అనేది తేలిపోనుంది.

ప్యాంగ్యాంగ్ సింహాసనంపై పట్టు సాధించే ఈ రేసులో గెలుపు ఎవరిదైనా.. ఆ గెలుపు వెనుక మరో ‘రక్తచరిత్ర’ రాసిపెట్టి ఉందనేది కాదనలేని సత్యం.

Tags:    

Similar News