మ‌ళ్లీ జింబాబ్వే దెబ్బ‌.. ఆస్ట్రేలియా ఔటాఫ్ ప్ర‌పంచ‌క‌ప్!

దీంతో గ్రూప్-బి నుంచి సూప‌ర్ 8కు అర్హ‌త సాధించే జ‌ట్ల‌పై ఉత్కంఠ మొద‌లైంది.;

Update: 2026-02-17 05:59 GMT

టి20 ప్ర‌పంచ క‌ప్ లో మ‌రో పెద్ద సంచ‌ల‌నం..? గ‌త వారం జింజాబ్వే చేతిలో ఓట‌మి పాలైన ఆస్ట్రేలియా.. ఈ వారం అస‌లు టోర్నీ నుంచే ఔట్ అయ్యేలా ఉంది..! అది కూడా జింబాబ్వే దెబ్బ‌తోనే కానుండ‌డం గ‌మ‌నార్హం. ఈ మాజీ చాంపియ‌న్ ను మ‌హా భార‌తంలో క‌ర్ణుడి త‌ర‌హాలో క‌ష్టాలు వెంటాడుతున్నాయి. కెప్టెన్ కు ఫిట్ నెస్ స‌మ‌స్య‌లు.. స్టార్ పేస్ బౌల‌ర్ల‌కు గాయాలు.. బ్యాట్స్ మెన్ ఫామ్ లేమి.. హార్డ్ హిట్ట‌ర్ల ఫెయిల్యూర్! పోయి పోయి.. టి20 ప్ర‌పంచ‌క‌ప్ లో త‌మ‌కు మింగుడుప‌డ‌ని జింబాబ్వే ఉన్న గ్రూప్ లో ఉండ‌డ‌మే ఆస్ట్రేలియాకు పెద్ద శాపం అయింది. ఇలా ఒక‌టేమిటి ఇంకా కాలం కూడా క‌లిసి రావ‌డం లేదు. సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్ లోనూ శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. శ్రీలంక‌లోని ప‌ల్లెకెలెలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ కిందామీద ప‌డి 181 ప‌రుగులు చేసింది. మోస్త‌రు టార్గెట్ అయినా శ్రీలంక అల‌వోక‌గా ఛేదించేసింది. దీంతో గ్రూప్-బి నుంచి సూప‌ర్ 8కు అర్హ‌త సాధించే జ‌ట్ల‌పై ఉత్కంఠ మొద‌లైంది.

గ్రూప్ బి.. బాబోయ్

ఆస్ట్రేలియా, శ్రీలంక‌, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమ‌న్.. ఇదీ టి20 ప్ర‌పంచ క‌ప్ గ్రూప్ బి. ఇందులో ఒమ‌న్ మాత్ర‌మే బ‌ల‌హీనం. పైగా మ్యాచ్ లు స్లో పిచ్ లు ఉండే శ్రీలంక‌లోనే. ఇదే ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ అయింది. గ‌త వారం జింబాబ్వే అనూహ్యంగా కంగారూల‌ను మ‌ట్టి క‌రిపించ‌గా.. ఈ వారం శ్రీలంక దెబ్బ‌కొట్టింది. ఆడిన మూడు మ్యాచ్ లు గెలిచిన లంక సూప‌ర్ 8కు చేరింది. ఐర్లాండ్ తో మ్యాచ్ లో జింబాబ్వే గ‌నుక గెలిస్తే ఆ జ‌ట్టే సూప‌ర్ 8కు చేరుతుంది. ఈ రెండు జ‌ట్ల మ్యాచ్ మంగ‌ళ‌వార‌మే.

ఐర్లాండ్ పైనే ఆసీస్ ఆశ‌ల‌న్నీ...

జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్ పైనే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆశ‌ల‌న్నీ. ఐర్లాండ్ నెగ్గాల‌ని గ‌ట్టిగా కోరుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ఒమ‌న్, ఆస్ట్రేలియాపై గెలిచిన ఊపులో ఉన్న జింబాబ్వేను ఐర్లాండ్ నిరోధించ‌గ‌ల‌దా? అంటే అవ‌కాశాలు ఉన్నాయి. కానీ, వంద శాతం ఐర్లాండ్ దే గెలుపు అని చెప్ప‌లేం. ఒక‌వేళ జింబాబ్వే గ‌నుక సూప‌ర్ 8 చేరితే.. టి20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఆ జ‌ట్టుకు ఇదే తొలిసారి అవుతుంది.

ఆసీస్ కు అస‌లు టి20 స‌త్తా ఉందా?

టెస్టులు, వ‌న్డేలలో మేటి జ‌ట్టే. కానీ, టి20ల్లో ఆస్ట్రేలియాకు పెద్ద జ‌ట్టు అన్న పేరు లేదు. ఎందుక‌నో ఆ దేశ క్రికెట‌ర్లు లీగ్ ల‌లో ఆడినంత తేలిక‌గా ఐసీసీ టోర్నీల్లో రాణించ‌డం లేదు. పైగా గాయాల స‌మ‌స్య‌. దీంతోనే... ఎప్పుడో ప‌క్క‌న పెట్టిన‌ వెట‌ర‌న్ బ్యాట‌ర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వంటివారిని మ‌ళ్లీ ఎంపిక చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఆస్ట్రేలియా ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ జ‌ట్టు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎన్నో అధిగ‌మించింది. ఎక్క‌డ పోయిందో అక్క‌డే నెగ్గ‌డం కంగారూల స్వ‌భావం. మ‌ళ్లీ టి20ల్లో పైకి లేవ‌డం ఖాయం. అయితే, అందుకు స‌మ‌యం ప‌డుతుంది.

Tags:    

Similar News