అంబటి రాంబాబు... జైల్లో ఉన్నా రాజే..

అయితే తన వయస్సు , ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపుతూ ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో జైలులో ఆయనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభించనున్నాయి.;

Update: 2026-02-17 05:03 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఇటీవలే అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు తాజాగా కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన అంబటి రాంబాబు.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో గడుపుతున్నారు. అయితే తన వయస్సు , ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపుతూ ఆయన గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో జైలులో ఆయనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభించనున్నాయి.

అంబటి కోరిన సదుపాయాలు ఇవే..

సాధారణ ఖైదీలకు భిన్నంగా తనకు కొన్ని వసతులు కావాలని ఆయన కోరారు. జైలు ఆహారం కాకుండా ఇంటి నుంచి వచ్చే వండిన భోజనం కావాలని.. ఒక పరుపు, మెత్తని బెడ్‌షీట్లు, దోమల వల కల్పించాలని.. అలాగే.. ఎయిర్ కూలర్ సదుపాయం... వ్యక్తిగత మందులు..నిరంతర వైద్య పర్యవేక్షణ... ఇతర ఖైదీలతో కాకుండా ప్రత్యేక గది కేటాయించాలని కోర్టుకు విన్నవించారు.

కోర్టు స్పందన

అంబటి రాంబాబు విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ సదుపాయాలను కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే జైలులో ఆయనకు ఈ వసతులు అందుబాటులోకి రానున్నాయి.

వీఐపీ ఖైదీల సంప్రదాయం కొనసాగుతోందా?

జైల్లో నేతలకు ఈ సౌకర్యాలు ఇది మొదటిసారి కాదు. గతంలో వైసీపీకి చెందిన మిధున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి కీలక నేతలు కూడా జైలుకు వెళ్లినప్పుడు ఇదే తరహా ప్రత్యేక సదుపాయాలను పొందారు. నిబంధనల ప్రకారం.. ప్రజాప్రతినిధులు లేదా మాజీ మంత్రులు అరెస్టయినప్పుడు వారి హోదా, భద్రత , ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టులు ఇలాంటి రాయితీలు ఇస్తుంటాయి.

రగులుతున్న రాజకీయ విమర్శలు

అంబటి రాంబాబుకు ప్రత్యేక సదుపాయాల కల్పనపై సామాజిక మాధ్యమాల్లో.. రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు.. కేవలం రాజకీయ పలుకుబడి ఉందనే కారణంతో సాధారణ ఖైదీలకు లేని 'రాజభోగాలు' వీఐపీలకు కల్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వయస్సు పైబడిన నాయకులకు కనీస ఆరోగ్య భద్రత కల్పించడం మానవత్వంతో కూడిన నిర్ణయమని వైసీపీ శ్రేణులు మద్దతిస్తున్నాయి..

మొత్తానికి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం కేవలం చట్టపరమైన ప్రక్రియగానే కాకుండా ఏపీలో మరోసారి 'వీఐపీ వర్సెస్ సామాన్యుడు' అనే చర్చకు దారితీసింది.

Tags:    

Similar News