''కాంగ్రెస్‌లో ఉండాలో.. వద్దో... తేల్చుకునే సమయం''
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక ఎన్నికల విజయం ఒకవైపు.. ఆనందాన్ని నింపగా.. మరోవైపు సీనియర్ నేతలు.. పార్టీ వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్నారు.;
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక ఎన్నికల విజయం ఒకవైపు.. ఆనందాన్ని నింపగా.. మరోవైపు సీనియర్ నేతలు.. పార్టీ వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్నారు. హంగ్ ఏర్పడిన స్థానాల్లో బీజేపీతో కలిసి మునిసిపాలిటీలను దక్కించుకోవడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్తే.. పార్టీ పరువు నిలబడేదని.. కానీ.. ఇప్పుడు పోయి పోయి బద్ధ శత్రువుతో చేతులు కలిపి.. అధికారం దక్కించుకోవడం ఎందుకని.. మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నిన్నటి వరకు బీజేపీని తాము వ్యతిరేకించామని.. ఇప్పుడు ఏమొహం పెట్టుకుని పార్టీలో ఉండాలని కొంద రు వ్యాఖ్యానించారు. ఇక, జగిత్యాలలో ఈ వేడి మరింత ఎక్కువగా రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలో వద్దో తేల్చుకునే సమయం వచ్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యం నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు.. తాను ఎందుకు పార్టీలో ఉండాలో అర్ధం కావడం లేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో హంగ్ ఏర్పడింది. ఏపార్టీకీ ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థుల పాత్ర కీలకంగా మారింది. దీనికి ముందు నుంచి జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ ఎస్ నుంచి విజయం దక్కించుకున్న సంజయ్.. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. తాను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా.. తనను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని జీవన్‌రెడ్డి చెబుతున్నారు.
తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో ఇరు వర్గాల నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థులు విజయం దక్కించుకు న్నారు. జీవన్ రెడ్డి వర్గం నుంచి 17 మంది పోటీ చేయగా.. 9 మంది గెలుపు గుర్రం ఎక్కారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది మద్దతు అవసరం. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. ఎమ్మెల్యే సంజయ్ వర్గం నుంచి 14 మంది, జీవన్ రెడ్డి వర్గం నుంచి 9 మంది విజయం సాధించారు.
ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు ఇరు పక్షాల మధ్య రాజీ చేసి సంజయ్ వర్గానికి చైర్‌పర్సన్ పదవి అప్పగించారు. వైస్ చైర్మన్ పదవిని జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చారు. ఇదే ఇప్పుడు జీవన్‌కు తీవ్ర అసంతృప్తిని రగిలించింది. దీంతో ఆయన తన దారి తాను చూసుకుంటానని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి.