ఢిల్లీ, హైదరాబాద్, ఫాం హౌజ్.. ఆ మాజీ సీఎంకు ఇంటి కష్టాలు!
2004లో తొలిసారి ఎంపీగా గెలిచిన సందర్భంలో కేంద్ర మంత్రిగా ఈ నివాసాన్ని ఆయనకు కేటాయించారు.;
అధికారంలో ఉన్నప్పుడే ఎవరికైనా రాజ బోగాలు.. మందీ మార్బలం.. అధికార యంత్రాంగం.. నాయక గణం.. అధికారిక నివాసాలు..ఆ హంగామానే వేరు.. కానీ, ఎంతటి నాయకుడికైనా అధికారం కోల్పోతే ఇవేవీ ఉండవు.. మరీ ముఖ్యంగా ముందుగా అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆపై ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఢిల్లీలో అలా..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్లుగా ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని నివాసాన్ని అధికారిక నివాసంగా వినియోగించుకున్నారు. 2004లో తొలిసారి ఎంపీగా గెలిచిన సందర్భంలో కేంద్ర మంత్రిగా ఈ నివాసాన్ని ఆయనకు కేటాయించారు. ఆపై 2014 వరకు ఎంపీగానే కొనసాగినా, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం అయినా.. కేసీఆర్ ఇదే ఇంటిని ఢిల్లీలో అధికారిక నివాసంగా కొనసాగించారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఓటమితో ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీనిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు.
హైదరాబాద్ లో ఇలా..
ఈ నెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం సాయంత్రమే కేసీఆర్ హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల్లోనే నివాసాన్ని ఖాళీ చేశారు. ఎన్నికలకు ముందే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రజా వాణి కార్యక్రమానికి ప్రజా భవన్ ను వినియోగించగమే కాక.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించారు. ఇప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా వాణికి భారీగా వినతులు వస్తున్నాయి.
ఫాం హౌజ్ కు వెళ్లలేరు.
కేసీఆర్ తెలంగాణ ఫలితాలు వెల్లడైన సాయంత్రమే.. అంటే ఈ నెల 3న ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్ కు వెళ్లిపోయారు. అక్కడే ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు, స్వగ్రామం చింతమడక వాసులు కలిశారు. అయితే, అనూహ్యంగా 7వ తేదీ సాయంత్రం ఆయన కిందపడ్డారు. దీంతో హైదరాబాద్ తీసుకొచ్చి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేయించారు. కాగా.. కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న సమయం నుంచి హైదరాబాద్ నంది నగర్ లోని ఇంట్లో నివాసం ఉండేవారు. సీఎం అయ్యాక బేగంపేటలో ప్రగతి భవన్ పేరిట 9 ఎకరాల్లో అధికారిక నివాసం కమ్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎర్రవల్లిలోని ఫాం హౌస్ ను 2011 ప్రాంతం నుంచి క్రమంగా నిర్మించుకుంటూ వస్తున్నారు. వైద్యం అవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లలేరు.
నందినగర్ ఇంటికే
వాస్తవానికి నందినగర్ ఇంటితో కేసీఆర్ కు దశాబ్దాల అనుబంధం ఉంది. అయితే, ఆ ఇల్లు అంత పెద్దదేం కాదు. నాయకులు ఎక్కువ సంఖ్యలో వస్తే ఇబ్బంది అవుతుంది. ఉద్యమ కాలంలో అయితే సరే కానీ.. ఇప్పుడు నాయకులు, కార్యకర్తల తాకిడిని తట్టుకుంటూ ఈ ఇంటిలో ఉండడం ఇబ్బందికరమే. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మరో పెద్ద ఇంటిని చూడమూంటూ కేసీఆర్ పార్టీ నాయకులను కోరారు. దీంతో ఓ ఎమ్మెల్యే ముందుకొచ్చి తన ఇంటిని తీసుకోమని కోరారు. తాను ఇటీవల కట్టుకున్న ఆ ఇల్లు చాలా విశాలంగా ఉందని తెలిపారు. కానీ, కేసీఆర్ మాత్రం నందినగర్ లో ఇంటికే మారారు. ఇదీ.. ఓ మాజీ సీఎంకు వచ్చిన ఇంటి కష్టాలు.