అవును.. అతడు కొంటున్న ఇంటి ఖరీదు రూ.1145కోట్లు

వ్యాపార అవసరాల కోసం.. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించిన ఒక భారీ భవంతిని తాజాగా కొనుగోలు చేసిన వైనం కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

Update: 2023-12-13 04:51 GMT

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కోట్లాది మందికి తీర్చలేని కష్టాల్ని మిగిలిస్తే.. కొందరిని మాత్రం ఎక్కడికో తీసుకెళ్లింది. కరోనా ముందు వరకు ఎవరికి తెలియన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా.. వ్యాక్సిన్ దెబ్బకు ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లిందో.. ఆయన ఆస్తులు ఎంత భారీగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. వ్యాపార అవసరాల కోసం.. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించిన ఒక భారీ భవంతిని తాజాగా కొనుగోలు చేసిన వైనం కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

దీనికి కారణం.. ఆ భారీ భవంతి డీల్ విలువ 138 మిలియన్ అమెరికా డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూ.1145 కోట్లు కావటమే. ఈ భారీ భవంతిని పూనావాలా సొంతం చేసుకుంటున్నట్లుగా లండన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ డీల్ ప్రత్యేకత ఏమంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లలో ఈ భవనం డీలే అత్యధిక మొత్తం కావటం గమనార్హం.

లండన్ లోని ఈ భారీ భవంతిని అబర్ కాన్వే హౌజ్ గా వ్యవహిస్తారు. లండన్ నడిబొడ్డున ఉన్న ఈ భారీ భవంతి ఏకంగా 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ భవనం యజమాని పోలండ్ సంపన్నురాలు డొమినికా కుల్కజిక్. ఆమె నుంచి ఈ భవంతిని కొనుగోలు చేయటానికి వీలుగా పూనావాలా ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. డొమినికా మరెవరో కాదు.. పోలండ్ లోనే అత్యంత సంపన్నుడైన జాన్ కుల్కజిక్ కుమార్తె. 1920 నాటి ఈ భవంతిని లండన్ కు వెళ్లినప్పుడు తన వ్యాపార.. వ్యక్తిగత అవసరాల కోసం పూనావాలా వినియోగించేవారు.

ఈ భవనాన్ని ఎస్ఐఐ బ్రిటన్ అనుబంధ సంస్థ సీరమ్ లైఫ్ సైన్సెస్ కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకు లండన్ లో అత్యధిక ధరకు అమ్ముడైన భవంతుల్లో దీనికి రెండో స్థానం లభిస్తుంది. 2020లో రాట్లాండ్ గేట్ 210 మిలియన డాలర్లకు అమ్ముడు కాగా.. తాజాగా దానికంటేతక్కువ మొత్తానికి ఈ భవనం అమ్ముడైంది.

Tags:    

Similar News