అత్యంత దారుణం... బాలికలు నెలసరిలో ఉన్నారో లేరో తెలుసుకోవాలని..!
అత్యంత ఘోరాతి ఘోరమైన ఘటన, దారుణాతి దారుణమైన సంఘటన తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది.;
అత్యంత ఘోరాతి ఘోరమైన ఘటన, దారుణాతి దారుణమైన సంఘటన తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాలా.. లేక, ఈ పనికి ఆదేశించిన, పూనుకున్న వారిని తలదించుకునేలా చేయాలా అనే ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. బాలికలు పీరియడ్స్ లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఓ స్కూలు యాజమాన్యం ఘోరానికి పాల్పడింది.
అవును... ఠాణే జిల్లాల్లోని ఓ పాఠశాల బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వాటికి కారణమైన వారిని తెలుసుకునేందుకు ఆ యాజమాన్యం దారుణమైన ఆలోచన చేసింది. ఇందులో భాగంగా.. బాలికలందరినీ వరుసగా నిలబెట్టి.. వారు పీరియడ్స్ లో ఉన్నారో, లేదో చెక్ చేయడానికి వారి వ్యక్తిగత అవయవాలను టచ్ చేసి టెస్ట్ చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... ఠాణెలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టాయిలెట్ ను శుభ్రం చేస్తుండగా.. రక్తపు మరకలు కన్పించాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది వాటిని ఫొటోలు తీసి, స్కూల్ ప్రిన్సిపల్ కు పంపించారు. దీంతో ఆ స్కూలు ప్రిన్సిపల్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం... ఆ స్కూల్లోని 5 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్ కు పిలిపించారు.
ఆ బాలికలందరికీ ఆ ఫొటోలు చూపించారు. అనంతరం.. పీరియడ్స్ లో ఉన్నవారు, లేనివారు రెండు గ్రూప్ లుగా విడిపోవాలని చెప్పారు. దీంతో... ప్రిన్సిపల్ చెప్పినట్లుగానే ఆ బాలికలంతా రెండు గ్రూపులుగా విడిపోయి నిల్చున్నారు. అయితే.. అప్పటికీ వారిని నమ్మని ఆ ప్రిన్సిపల్.. మహిళా అటెండెంట్ ని పిలిపించి, నెలసరిలో లేమని చెప్పిన బాలికలను చెక్ చేయించారు.
ఇందులో భాగంగా... ఆ బాలికలందరినీ వాష్ రూమ్ కి తీసుకెళ్లి వారి వారి వ్యక్తిగత అవయువాలను చెక్ చేసి మరీ కన్ఫర్మేషన్ కి వచ్చారు. దీంతో... ఇంటికెళ్లిన తర్వాత ఆ బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. స్కూల్ ముందు నిరసన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతొ.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రిన్సిపల్, మహిళా అటెండెంట్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలు కలిసి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రిన్సిపల్, ప్యూన్ ను అరెస్టు చేయగా, మిగతా వారిని విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఠాణే గ్రామీణ అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ జల్టే... బాలికలను ఈ రకమైన తనిఖీకి గురిచేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు, వారు పాఠశాల వద్ద గుమిగూడి, సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారిందని అన్నారు.
ఈ కేసులోని ఎనిమిది మందిపై భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్.) సెక్షన్లు 74, 76, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోస్కో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.