అభిమానులను తోసేస్తావా? హీరో విజయ్ పై కేసు

ఆగస్టు 21న మదురైలో టీవీకే పార్టీ మహానాడు ఘనంగా జరిగింది. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు.;

Update: 2025-08-27 12:19 GMT

తమిళ సినీ స్టార్, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ పై కేసు నమోదు కావడంతో తమిళనాడులో రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేగింది. మదురైలో ఇటీవల జరిగిన పార్టీ మహానాడు సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటే ఈ వివాదానికి కారణమైంది.

ఆగస్టు 21న మదురైలో టీవీకే పార్టీ మహానాడు ఘనంగా జరిగింది. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంప్‌ పై నడుస్తూ అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ర్యాంప్‌పైకి దూకి విజయ్‌ను దగ్గరగా కలవాలని ప్రయత్నించారు. దీంతో బౌన్సర్లు వారిని అడ్డుకోవడంతో పాటు తోసేయడం జరిగింది.

ఫిర్యాదు.. కేసు నమోదు

ఈ సంఘటనలో శరత్‌కుమార్ అనే అభిమాని గాయపడ్డారని ఆరోపించారు. తనపై బౌన్సర్లు దాడి చేశారని, ఈ క్రమంలో విజయ్ కూడా బాధ్యత వహించాలని పెరంబలూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్‌తో పాటు ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- రాజకీయ సమీకరణల్లో విజయ్

ఇక 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ ఇప్పటికే సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. టీవీకే పార్టీ స్థాపించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభల ద్వారా బలోపేతం చేస్తున్నారు. మదురై సభలో విజయ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో డీఎంకే-టీవీకే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో బీజేపీకి అవకాశమే లేదని విమర్శించారు.

ఒకవైపు రాజకీయ బాటలో అడుగులు వేస్తున్న విజయ్‌కు, మరోవైపు అభిమానుల మధ్య ఉత్సాహం పెరగడం, దానికి సంబంధించిన సంఘటనలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News