మంచు బ్రదర్స్, రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్, అఘోరీ వర్షిణి.. ఇదేం గోలరా బాబూ!
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ప్రధానాంశాలు ఏంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారం ఏది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిపక్షాల పోరాటాలు ఎలా ఉన్నాయి.. ఇలాంటి వాటి కోసం మీడియాలో వెతుకుతున్నారా?;
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ప్రధానాంశాలు ఏంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారం ఏది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిపక్షాల పోరాటాలు ఎలా ఉన్నాయి.. ఇలాంటి వాటి కోసం మీడియాలో వెతుకుతున్నారా? ప్రజలందరికీ పనికొచ్చే సమాచారం ఏదైనా మీ టీవీలో వస్తోందా? ఫోన్ తెరవగానే కనిపించే న్యూస్ ఏంటి? ప్రజలకు మేలు చేసే అంశాలేవీ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజలు టైం పాస్ గా ఎంచుకునే విషయాలే వార్తలు అవుతున్నాయి. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏమైంది? రాజ్ తరుణ్ లవర్ లావణ్య గొడవ ఎక్కడి వరకు వచ్చింది? అన్న విషయాలే గత కొంత కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు ఇష్యూలకు తోడుగా అఘోరీ, వర్షిణి కథ కతలుకతలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మూడు అంశాల్లో ప్రజలకు పనికొచ్చే విషమేంటి? అన్నది చూడకుండా డిజిటల్ మీడియాతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రజా సమస్యలను విస్మరిస్తూ ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసే ప్రైవేటు వ్యవహారాలకే ప్రాధాన్యమివ్వడంపై విచారం వ్యక్తమవుతోంది.
మీడియాకు ఎంతో సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లరుగా భావించే మీడియా ఇప్పుడు తన సామాజిక బాధ్యతను విస్మరిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా డిజిటల్ మీడియా యుగంలో యూట్యూబ్ చానళ్లు, యూట్యూబర్స్ తో పోటీ పడే మార్గంలో మీడియా తన ప్రాధాన్యాలను గాలికి వదిలేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ప్రజా సమస్యలు కన్నా ప్రైవేటు వ్యవహారాలపై ఎక్కువ ఫోకస్ చేస్తోందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరే విషయాలు లేనట్లు డిజిటల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీం మీడియాలోనూ కొన్ని రోజులుగా మూడు ప్రైవేటు ఇష్యూలపై ఫోకస్ చేయడం విమర్శలకు తావిస్తోంది.
దేశంలో ఏ ఇంట్లోనూ సమస్యలు లేనట్లు కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూని మీడియా రచ్చ చేస్తోంది. దీంతో అన్నదమ్ముల మధ్య బంధం మరింత బలహీనపడుతోందని అంటున్నారు.ప్రజల ఆసక్తి మేరకు తొలుత ఈ వివాదాన్ని మీడియా ప్రాధాన్యమిచ్చారని అనుకున్నా, అదో డైలీ సీరియల్ గా కొనసాగిస్తుండటం విమర్శలు ఎదుర్కొంటోంది. మంచు బ్రదర్స్ ఇష్యూలో మీడియా అత్యుత్సాహంతో సామరస్యంగా పరిష్కారమవ్వాల్సిన గొడవ.. పూడ్చలేనంత అగాధంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇష్యూని మీడియా వదిలేస్తే.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే, రోజూ తమను మీడియా కవర్ చేస్తుండటం వల్ల రీల్ హీరోలు రియల్ హీరోలుగా తలపడుతున్నారని అంటున్నారు.
మీడియాతోపాటు మంచు కుటుంబం కూడా గొడవను పరిష్కరించుకోకుండా, మీడియా ప్రచారం వల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పుకోవాలని చూస్తోందని అంటున్నారు. వివాదం మొదలైన తొలినాళ్లలో మంచు మోహనాబాబు మీడియాతో గొడవ పడటం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే. అదే ఊపులో ఇద్దరు అన్నదమ్ములను కూర్చోబెట్టి పరిష్కరించకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. సినీ ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకునే మోహనబాబు తన కుటుంబ వివాదాన్ని పరిష్కరించలేకపోవడంతో వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు నష్టం జరుగుతోందని అంటున్నారు.
అదేవిధంగా మరో సినీ నటుడు రాజ్ తరుణ్ లవ్ స్టోరీని మీడియా వదలడం లేదు. రాజ్ తరుణ్ సినిమా ప్రమోషన్లకు మించి ఆయన మాజీ ప్రేయసి లావణ్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. మహిళగా అమెకు అన్యాయం జరిగితే మద్దతుగా నిలవడంలో తప్పులేదని, కానీ ఆమె చెప్పిన ప్రతి అంశాన్ని నిర్ధారించుకోకుండా రాద్ధాంతం చేయడం వల్ల రాజ్ తరుణ్-లావణ్య ఇష్యూకి ఎండ్ కార్డు పడటం లేదంటున్నారు. దాదాపు ఏడాదిగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ వివాదానికి మీడియా పేకప్ చెప్పాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యూస్ కోసం ప్రైవేటు వ్యక్తుల కుటుంబాల ప్రైవసీని నాశనం చేయకూడదు కదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు రాజ్ తరుణ్, లావణ్య కుటుంబాలు కూడా ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచన లేకపోవడంపైనా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇక తాజాగా మీడియా ఎంచుకున్న మరో అంశం అఘోరీ, శ్రీవర్షిణి ఇష్యూ కూడా విమర్శలకు దారితీస్తోంది. కొద్ది నెలల క్రితం అఘోరీ చూపిన అత్యుత్సానికి అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ఓ మహిళ అఘోరీగా మారిన పురుషుడి ట్రాప్లో పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ జండర్ గా మారిన శ్రీనివాస్ అనే వ్యక్తి నాగ సాధవుగా చెప్పుకుంటూ కొద్ది నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేశాడు. అతడేదో ప్రత్యేకంగా దివి నుంచి భువి దిగి వచ్చినట్లు మీడియా విస్తృత కవరేజ్ ఇవ్వడంతో ఓ కుటుంబం బలైపోయిందని అంటున్నారు. నాగ సాధవుగా చెప్పుకున్న అఘోరీకి మీడియా ప్రాధాన్యం ఇవ్వకపోతే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటున్నారు. మీడియా సంయమనం పాటించకపోవడంతో అప్రాధాన్య అంశాలకు విస్తృత కవరేజుతో శాంతిభద్రతల సమస్యగా మారుతున్నాయంటున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు లాగేలా మీడియా వ్యవహరిస్తోందని ఈ మూడు అంశాలను ఉదహరిస్తున్నారు.