సా..గుతోంది: కేటీఆర్ విదేశీ పర్యటన దుబాయ్ దాకి వచ్చి ఆగిందట

ఆయనేం సాదాసీదా వ్యక్తేం కాదు. దేశంలోనే దూసుకుపోతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నవారు.;

Update: 2023-09-07 04:57 GMT

ఆయనేం సాదాసీదా వ్యక్తేం కాదు. దేశంలోనే దూసుకుపోతున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఎంతమంది ఉన్నా.. మంత్రి కేటీఆర్ స్థాయి.. స్థానం లెక్కనే వేరుగా ఉంటుంది. రాజకీయప్రత్యర్థులు ఆయన మంత్రి కాదు డిఫ్యాక్టో సీఎం అంటూ మాటలు అంటున్నా.. తండ్రి సీఎం అయినప్పుడు కొడుకు సమర్థుడైతే యాక్టింగ్ సీఎం అయితే తప్పేంటి? అంటూ సమర్థించేవారు లేకపోలేదు. ఈ వాదనకు తగ్గట్లే.. మంత్రి కేటీఆర్ అదే పనిగా శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల్ని చేసేస్తుంటారు.

దేశంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ఏ మంత్రి కూడా కేటీఆర్ చేసినన్ని శంకుస్థాపనలు.. ఓపెనింగ్ లు చేసి ఉండరేమో. అలాంటి ఆయన రెండు వారాలకు పైనే విదేశీ పర్యటనల్లో ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కొడుకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినంతనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే.

ఈ జాబితాలో తన వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇప్పించుకోవటంలో మంత్రి కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. తామెంతో ఆశ పెట్టుకున్న టికెట్లు రాలేని వైనాన్ని.. మంత్రి కేటీఆర్ ను కలిసి ఆవేదనను పంచుకోవాలని తపిస్తున్నారు. సాధారణంగా మంత్రి కేటీఆర్ జరిపే విదేశీ పర్యటనలు ఏవైనా సరే.. జెట్ స్పీడ్ లో సాగిపోతుంటాయి. అందుకు భిన్నంగా ఈసారి టూర్ మాత్రం సా..గుతోంది. మూడు రోజుల క్రితమే దుబాయ్ వరకు వచ్చిన ఆయన.. ఏదో ఒక అంశంపై బిజీగా ఉన్నానన్న భావనను కలిగించేందుకు చేస్తున్న కసరత్తు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.

రెండు రోజుల క్రితం దుబాయ్ లోని పలువురు ప్రముఖులతో కలిసిన సందర్భంగా తెలంగాణకు వచ్చినట్లుగా ప్రకటించిన పెట్టుబడుల్లో..కొన్ని గతంలోనే ప్రకటించినవన్న వాదన వినిపిస్తోంది. నిజానికి దుబాయ్ లో తాజాగా ప్రకటించిన పెట్టుబడుల లెక్క వందల కోట్లలోనే ఉండటం గమనార్హం. విదేశీ పర్యటన అంటూ వారాల తరబడి దేశం కాని దేశాల్లో మంత్రి కేటీఆర్ ఎందుకు ఉంటున్నారు? సొంత వర్గం నుంచి వచ్చే టికెట్ల రిక్వెస్టులను డీల్ చేయటం తలనొప్పిగా ఉండి.. వాటికి కాస్త దూరంగా ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సా..గుతున్న కేటీఆర్ విదేశీ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News