కాంగ్రెస్‌ లో 'ఫ్యామిలీ ప్యాక్‌' కోరుతున్న నేతలు వీరే!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉంది.;

Update: 2023-09-02 14:30 GMT

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. పొరుగు రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే విజయాన్ని రిపీట్‌ చేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ లో అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలు వీడి ఐకమత్యంగా కదనోత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల్లోని కీలక నేతలు పార్టీలో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 119 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 1000కి పైగా వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నుంచి మిగతా నేతలంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. తొలి విడతగా విడుదల చేసే జాబితాలో 35–40 మంది సభ్యులు ఉంటారని అంటున్నారు.

కాగా కొన్ని నియోజకవర్గాల్లో తమకు ఫ్యామిలీ ప్యాక్‌ కావాలని నేతలు కోరుతున్నారని సమాచారం. అంటే ఒకే ఫ్యామిలీ నుంచి రెండు టికెట్లు కావాలని కోరుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనకు, తన సతీమణికి హుజూర్‌ నగర్, కోదాడ సీట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఆమె కుమారుడు సూర్యం.. ములుగు, పినపాక టికెట్లను ఆశిస్తున్నారు. ఇక సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారులు.. రఘువీర్‌ రెడ్డి, జైవీర్‌ రెడ్డి నాగార్జున సాగర్, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నారు.

అలాగే మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ తనకు ఆందోల్‌ టికెట్‌ తోపాటు తన కుమార్తె త్రిశాలకు పార్లమెంటు సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ సైతం తన కుమారుడికి ముషీరాబాద్‌ అసెంబ్లీ సీటును కేటాయించడంతోపాటు తనకు సికింద్రాబాద్‌ ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు.

అలాగే మాజీ మంత్రి బలరాం నాయక్‌.. వరంగల్‌ ఎంపీ సీటుకు, ఆయన కుమారుడు సాయిరాం నాయక్‌ ఇల్లెందు అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. వీరి బాటలోనే మాజీ మంత్రి కొండా సురేఖ తనతోపాటు తన భర్తకు, అలాగే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తనతోపాటు తన కోడలు వైశాలికి టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు.

ఇలా కుటుంబంలో రెండు టికెట్లు ఆశిస్తున్నవారంతా సీనియర్‌ నేతలు కావడం, అధిష్టానానికి సన్నిహితులు కావడంతో వీరి సీట్ల విషయంలో పీసీసీకి ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు.

అయితే రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌ లో తీసుకున్న డిక్లరేషన్‌ ప్రకారం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే సీటు ఇవ్వాలని నిర్ణయించారని.. ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ను ఉటంకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఎవరో ఒకరికే టిక్కెట్‌ అంటూ పీసీసీ తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది. వన్‌ ఫ్యామిలీ.. వన్‌ టిక్కెట్‌ అంటూ కొత్త ఫార్ములాను తెరపైకి తెస్తోందని అంటున్నారు. అయితే నేతలు మాత్రం పట్టు వీడకుండా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. మరి కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నేతలు కోరినట్టు ఫ్యామిలీ ప్యాక్‌ కు అంగీకరిస్తుందో, లేదో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News