బ్రతుకుతెరువు కోసం వెళ్లి బందీలయ్యారు.. రష్యా రక్తక్షేత్రంలో తెలుగు బిడ్డల నరకయాతన

భుక్య రవీందర్, భుక్య అశోక్, మేఘావత్ ప్రకాశ్, మహ్మద్ అఫ్జల్ ఖాన్.. ఈ నలుగురు యువకులు 2026 ఫిబ్రవరిలో ఎన్నో ఆశల కళ్లతో రష్యాకు విమానమెక్కారు.

Update: 2026-10-01 06:58 GMT

ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న కుటుంబాలకు ఆసరాగా నిలవాలనుకున్నారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసేందుకు.. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు కన్న నేల వదిలి సముద్రాలు దాటి వెళ్లారు. కానీ ఉపాధి చూపుతామని నమ్మించిన ఏజెంట్లు వారి జీవితాలను మరణమృదంగం మోగుతున్న యుద్ధభూమికి తెగనమ్మేశారు. రష్యా-ఉక్రెయిన్ పోరులో చిక్కుకున్న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు అనుభవిస్తున్న నరకయాతన దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.

భుక్య రవీందర్, భుక్య అశోక్, మేఘావత్ ప్రకాశ్, మహ్మద్ అఫ్జల్ ఖాన్.. ఈ నలుగురు యువకులు 2026 ఫిబ్రవరిలో ఎన్నో ఆశల కళ్లతో రష్యాకు విమానమెక్కారు. ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలు వసూలు చేసిన మోసపూరిత ఏజెంట్లు, క్లీనింగ్ పనులు, ఆయిల్ కంపెనీల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. తీరా రష్యా తీరంలో అడుగుపెట్టాక అసలు నరకం మొదలైంది. జీతాలు ఇవ్వకపోగా సైనిక దుస్తులేసి బలవంతంగా యుద్ధరంగంలోకి నెట్టేశారు.

"మేము యుద్ధం చేయలేం.. మమ్మల్ని ఇంటికి పంపించండి" అని వేడుకున్న పాపానికి రష్యా అధికారులు వారిపై క్రూరత్వానికి దిగారు. క్యాంప్‌ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు ఆ నలుగురు యువకులను చెట్లకు కట్టేసి నరకం చూపించారు. అనంతరం ఏకంగా జీవన్మరణ పోరాటం జరుగుతున్న ఫ్రంట్‌లైన్ ప్రాంతాలకు బలవంతంగా తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆ బాధితులు విడుదల చేసిన ఆవేదన వీడియోలు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి.

సొంత బిడ్డలు మృత్యుముఖంలో ఉన్నారనే వార్త విని కన్నతల్లులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బిడ్డల ప్రాణాలను కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితులను వివరిస్తూ లేఖ సమర్పించారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే ఈ యుద్ధంలో 200 మందికి పైగా భారతీయులు చిక్కుకోగా సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. కష్టపడి బతికేందుకు వెళ్లిన మన తెలంగాణ బిడ్డలు ప్రాణాలతో క్షేమంగా స్వదేశానికి.. కన్నవారి ఒడికి చేరుకోవాలని రష్యన్ సైన్యం గుప్పిట్లో ఉన్న ఆ యువకుల కుటుంబాలతో పాటు సమస్త ప్రజానీకం దేవుడిని ప్రార్థిస్తోంది.

Tags:    

Similar News