లాంచీలో శ్రీశైలం ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి పచ్చదనం మధ్య ఎత్తైన కొండలు చూస్తూ సాగే సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది.;

Update: 2025-11-21 13:30 GMT

కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి పచ్చదనం మధ్య ఎత్తైన కొండలు చూస్తూ సాగే సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సాగర్ - శ్రీశైలం జలాశయాల మధ్య లాంచీ ప్రయాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా సుమారు 110 కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రయాణానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రారంభంలో వారానికి ఒకసారి మాత్రమే లాంచీ ప్రయాణ సౌకర్యం కల్పించాలని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. సాగర్ నీటిమట్టం 550 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే లాంచీ ప్రయాణానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు లాంచీని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరకుంటుంది. అక్కడి నుంచి పర్యాటకులు తమ సొంత ఖర్చులతో ప్రైవేటు వాహనాల్లో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు.

రెండు రోజులు పాటు సాగే ప్రయాణానికి పర్యాటకశాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఒకవైపు లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1,600 నిర్ణయించారు. అదేవిధంగా శ్రీశైలం నుంచి సాగర్ కు తిరుగు ప్రయాణం కూడా బుక్ చేసుకుంటే పెద్దలకు రూ.3,250, పిల్లలకురూ.2,600 చెల్లించాల్సివుంటుంది. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని పర్యాటక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫోన్ నెంబరు 9849540371, 7997951023కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా పర్యాటక శాఖ వెబ్సైట్ (www.tgtdc.in)లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఇక ఏపీ ప్రభుత్వం కూడా శ్రీశైలానికి సీప్లేన్ టూరిజం ప్లాన్ చేస్తుంది. విజయవాడ-శ్రీశైలం సీప్లేన్ సేవలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గత ఉగాది నాడు ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వాలు శ్రీశైలం జలాశయాన్ని పర్యాటకంగా కూడా వాడుకోవాలని చూడటం విశేషం. మొత్తానికి రెండు ప్రభుత్వాలు పర్యాటకులకు వింతైన ఆహ్లాదాన్ని పంచేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News