తెలంగాణ 'స్థానికం' ఇప్పట్లో లేనట్టే.. రీజనేంటి?
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పక్షాలు ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.;
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ ఎస్, బీజేపీ, ఇతర పక్షాలు ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రధానంగా మూడు కారణాలు అడ్డు పడుతున్నాయని తెలుస్తోంది. తాజాగా సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ఎన్నికలు ఇప్పట్లో జరిపే ఉద్దేశం ఉన్నా.. ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కుల గణన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. పూర్తిస్థాయి లో నివేదిక రావాల్సి ఉందని తెలిపింది.
అయితే.. కోర్టు ప్రభుత్వాన్ని సీరియస్‌గా ప్రశ్నించింది. "ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రక్రియను సాగదీస్తారు?" అని నిలదీసింది. దీంతో మరో నెల రోజులు అయినా తమకు సమయం పడుతుందని.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరింది. మరోవైపు.. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తమకు ఏర్పాట్లు చేసేందుకు, నిర్వహించేందుకు కనీసంలో కనీసం 60 రోజులు(రెండు మాసాలు) పడుతుందని.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై హైకోర్టు స్పందించలేదు. వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి 1నే గ్రామ స్థాయి స్థానిక సంస్థలకు కాలం ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పంచాయితీలకు చెందిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించేం దుకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందని.. ఈ నేపథ్యంలో తమను పొడిగించాలని.. కోర్టును కోరారు. లేకపోతే, వెంటనే ఎన్నికలు పెట్టేలా అయినా.. సర్కారును ఆదేశించాలని వారు కోరారు. ఈ పిటిషన్లను కలిపి విచారిస్తున్న కోర్టులోనూ వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. దీంతో పంచాయతీలు, గ్రామాల్లో ఎటుచూసినా ఈ చర్చే కనిపిస్తోంది. వినిపిస్తోంది. ఇక, ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పట్లో ఎన్నికలకు అవకాశం కనిపించడంలేదని తెలుస్తోంది.
కారణం ఏంటి?
అయితే.. అసలు ఎన్నికల విషయంపై కాంగ్రెస్ సర్కారు వెనుకంజ వేయడానికి పైకి చెబుతున్న కుల గణన మాత్రమే కారణం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా నిధులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. రైతుల నాడిని ప్రభుత్వం పసిగట్టాల్సిన అవసరంఉంది దీనికితోడు ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం కూడా.. చర్చకు వస్తోంది. ఈ రెండు కీలక అంశాలు.. పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. మరోవైపు.. సర్కారుపై పూర్తిస్థాయిలో సంతృప్తి వచ్చిందా? లేదా? అనేది కూడా ప్రభుత్వానికి సందేహంగా మారింది. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. వెరసి.. ఎన్నికల వాయిదాకు పలు కారణాలు కనిపిస్తున్నాయి.