గ‌తం గుర్తు చేద్దాం: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై బీఆర్ ఎస్ ప్లాన్‌

తెలంగాణలో పంచాయతీ స‌మ‌రం ప్రారంభ‌మైంది. తొలిదశ నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగిసింది. మొత్తం 12,760 పంచాయతీ లకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి.;

Update: 2025-11-30 03:31 GMT

తెలంగాణలో పంచాయతీ స‌మ‌రం ప్రారంభ‌మైంది. తొలిదశ నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగిసింది. మొత్తం 12,760 పంచాయతీ లకు సర్పంచ్‌లు, 1,12,534 వార్డులకు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలకు నిర్వ‌హిస్తున్నా రు. తొలి విడత డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అన్నీ ఈవీఎంల‌తోనే నిర్వ‌హించ‌నున్నారు. పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జ‌రుగుతున్నా.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు తాము బలపరిచే అభ్యర్థుల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ భిన్న‌మైన పంథాల‌ను అనుస‌రిస్తున్నాయి. ప్ర‌ధానంగా గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ్రామీణంలో ప‌ట్టుకోల్పోయిన బీఆర్ ఎస్‌.. ఈ ద‌ఫా దానిని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. నిజానికి గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ ఉద్య‌మ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. దీనిని బీఆర్ ఎస్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. కానీ, గ‌త 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో గ్రామీణ ప్ర‌జ‌లు బీఆర్ ఎస్‌ను ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత పంచాయ‌తీ ఎన్నిక‌ల ద్వారా.. తిరిగి ఆ ప్ర‌భావాన్ని పొందాల‌న్న‌ది బీఆర్ ఎస్ వ్యూహం.

ఈ క్ర‌మంలో గ‌తాన్ని గుర్తు చేసేందుకు నాయ‌కులు రెడీ అవుతున్నారు. స‌మ‌యం స్వ‌ల్పంగా ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌నున్నారు. బీఆర్ ఎస్ హ‌యాంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఇందిర‌మ్మ ఇళ్లు, రైతు బంధు, బ‌తుక‌మ్మ చీర‌లు, మిషన్ భగీరథ వంటి పథకాలను మ‌రోసారి గుర్తు చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో పేద‌ల ఇళ్ల‌లో జ‌రిగిన వివాహాల‌కు కల్యాణ లక్ష్మి పేరుతో చేసిన సాయం వంటివాటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా తిరిగి పుంజుకోవాల‌న్న‌ది ప్లాన్‌. అయితే.. ఇదొక్క‌టే కాకుండా.. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను కూడా వివ‌రిస్తున్నారు.

`కేసీఆర్ సార్ ఉంటే..` అనే చ‌ర్చ‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య పెట్ట‌నున్నారు. త‌ద్వారా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బలాన్ని నిరూపించుకోవాల‌న్న‌ది బీఆర్ ఎస్ వ్యూహం. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్‌ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స‌హా అంద‌రికీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గ్రామాల్లో క్రియాశీలకంగా లేని నేతలను కలిసి.. వారిని బుజ్జ‌గిస్తున్నారు. ఇప్పుడు గెలిస్తే.. మ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌లు తేలిక‌గా గెలిచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వారికి నూరిపోస్తున్నారు. మొత్తానికి ఈ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News