రాత్రి 9 గంటల వేళకు ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదెందుకు?
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలకు, 7 నగర కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకుకూడా రాని పరిస్థితి.;
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలకు, 7 నగర కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకుకూడా రాని పరిస్థితి. దగ్గర దగ్గర పదకొండు దాటిన తర్వాతే ఫలితాలు పూర్తిగా.. అధికారికంగా వెలువడిన పరిస్థితి. ఒక్క వార్డు ఫలితం అర్థరాత్రి పన్నెండుకు గంటలకు కూడా రాలేదు. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ గంటల తరబడి సుదీర్ఘంగా సాగింది. ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది.
అదే సమయంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య భారీగా ఏమి ఉండదు. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల లోని వార్డుల్ని కలిపితే 2996. మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో కనిష్ఠంగా 800 - వెయ్యి వరకు ఓటర్లు ఉంటే.. గరిష్ఠంగా మాత్రం వెయ్యి నుంచి 2,500 మంది ఓటర్లు ఉండే వీలుంది. అదే విధంగా కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల్లో కనిష్ఠంగా ఓటర్ల సంఖ్య 2వేల నుంచి 2500 ఓటర్లు ఉంటారు. అదే విధంగా గరిష్ఠంగా అయితే 5వేల నుంచి 6 వేల వరకు ఉండొచ్చు.
సంఖ్యా పరంగా చూసినప్పుడు ఏ వార్డులోనూ పదివేలు.. ఇరవై వేల ఓట్లు ఉన్నది లేదు. అలాంటప్పుడు ఓట్ల లెక్కింపు.. ఫలితాన్ని ప్రకటించే అంశం చాలా వేగంగా సాగాలి కదా? మధ్యాహ్నంకాకున్నా కనీసం సాయంత్రం ఆరు గంటలకు క్లారిటీ రావాలి కదా? అలా ఎందుకు జరగలేదు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానాలు వెతికితే.. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా రావటం.. వాటి లెక్క తేల్చటం.. ఈ క్రమంలో అనుసరించే ప్రొసీజర్ ఆలస్యానికి కారణంగా చెప్పాలి. పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి.. డిక్లరేషన్ సరి చూడటం సిబ్బందికి చాలా సమయం పట్టింది. దీనికి తోడు అభ్యర్థులు.. ఏజెంట్లు ఎవరైనా సందేహాన్ని లేవనెత్తితే.. దానిని తీర్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలే వరకు ఓట్లను లెక్కేసే ప్రక్రియను ప్రారంభించకూడదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాంకేతిక సమస్యలు హుజూరాబాద్ లోని స్ట్రాంగ్ రూం తాళం చెవిపోవటంతో అధికారులు సుత్తితో తాళాన్ని పగులకొట్టాల్సి వచ్చింది. దీంతో అక్కడ లెక్కింపు ఆలస్యంగా మొదలైంది. సంగారెడ్డి తారా కాలేజీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగింది. దీంతో ఓట్ల లెక్కింపు ఆపారు. బ్యాలెట్ పేపర్ల మీద ముద్ర సరిగా లేకున్నా.. ఇంకు పక్కకు అంగినా.. అది చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న అంశంపై ఏజెంట్లఅభ్యంతరాల్ని పూర్తిగా పరిష్కరిస్తే తప్పించి.. ఫలితాల్నితేల్చలేని పరిస్థితి. ఇది కూడా ఆలస్యానికి కారణం. ఓట్ల లెక్కింపు.. ఫలితాన్ని ప్రకటించే అంశంపై వేగం కంటే కూడా పారదర్శకకు పెద్దపీట వేయటంతో ఫలితాలు ఆలస్యంగా రావటం జరిగింది. అదే సమయంలో స్పష్టత మిస్ కాకుండా ఉండటం చూస్తే.. ఎన్నికల సంఘాన్ని అభినందించాల్సిందే.