పవర్ కోసం కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్.. మజ్లిస్ కలిసిపోయాయి

అంతిమంగా అధికారం చేతికి రావాలంతే అన్నట్లుగా వ్యవహరించాయి రాజకీయ పార్టీలు.;

Update: 2026-02-17 07:58 GMT

అంతిమంగా అధికారం చేతికి రావాలంతే అన్నట్లుగా వ్యవహరించాయి రాజకీయ పార్టీలు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పదవుల్ని సొంతం చేసుకోవటానికి.. అగర్భ శత్రువులుగా వ్యవహరించే పార్టీలు సైతం తమ వైరాన్ని పక్కన పెట్టేసి.. ఒకరికొకరు కలిసిపోయిన అరుదైన సన్నివేశాలు తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో చోటు చేసుకున్నాయి. ఒకే గొడుగు కిందకు కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. మజ్లిస్ లు వచ్చిన పరిస్థితి. ఒక్కోచోట ఒక్కో కాంబినేషన్ తో అధికారాన్ని సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. అలాంటి సన్నివేశాలు ఎక్కడెక్కడంటే..

ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో బీజేపీ అత్యధికంగా 49 స్థానాల్ని సొంతం చేసుకుంది. కానీ.. కాంగ్రెస్ రెబల్ కౌన్సిలర్ బండారి అనూష కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెకు బీఆర్ఎస్, మజ్లిస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇవ్వటంతో ఆమె ఛైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. మజ్లిస్ కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక.. భైంసా మజ్లిస్ కంచుకోట. అలాంటిది అందుకు భిన్నంగా బీజేపీ రెబల్ కారణంగా సీన్ మొత్తం మారిపోయింది. మొత్తం 26 వార్డుల్లో పన్నెండు వార్డుల్ని మజ్లిస్ సొంతం చేసుకుంది. బీజేపీ.. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసి ఛైర్ పర్సన్ గా బీజేపీ రెబల్ దత్తారాంకు మద్దతు ఇవ్వటంతో ఆయన ఛైర్ పర్సన్ అయ్యారు. అదే సమయంలో మజ్లిస్ రెబల్ అభ్యర్థి వైస్ ఛైర్మన్ కావటం విశేషం. మొత్తంగా భైంసాలో తిరుగుబాటు అభ్యర్థులకే అధికార పీఠాలు సొంతమయ్యాయి.

నర్సాపూర్ లో కాంగ్రెస్ ఆరు వార్డుల్లో.. బీఆర్ఎస్ ఐదు వార్డుల్లో.. బీజేపీ నాలుగు వార్డుల్లో గెలిచాయి. దీంతో బీజేపీ అభ్యర్తులు కాంగ్రెస్ కు మద్దతు పలికి వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. మెదక్ లో కాంగ్రెస్కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తూ ఓటింగ్ కు గైర్హాజరు అయ్యింది. దీంతో.. కాంగ్రెస్ ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకుంది. ఇస్నాపూర్ లో ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫీషియ సభ్యుడిగా బీఆర్ఎస్ కు వేయటంతో ఛైర్ పర్సన్ పదవి బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. జిన్నారంలో బీఆర్ఎస్ కు 8, బీజేపీకి నాలుగు.. కాంగ్రెస్ కు ఆరు వార్డులు వచ్చాయి. బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు పలకటంతో బీఆర్ఎస్ అభ్యర్జికి ఛైర్ పర్సన్ పదవి సొంతమైంది.

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మూడు చొప్పున వార్డులు గెలిచాయి. సీపీఎం ఒక వార్డులో గెలిచింది. కాంగ్రెస్ కు సీపీఎం కౌన్సిలర్ మద్దతు ఇచమచాడు. అదే సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సువర్ణ కాంగ్రెస్ లో చేరారు. ఆమెను ఛైర్ పర్సన్ గా ఎంపిక చేయటంతో కాంగ్రెస్ సొంతమైంది. రంగారెడ్డి అమనగల్లు మున్సిపాలిటీలో కాంగ్రెస్.. బీజేపీలు సహకరించుకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కౌన్సెలర్ ను ఛైర్ పర్సన్ గా ఎంపిక చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకున్నాయి. అదే విధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అలియాబాద్ లోనూ బీజేపీ.. కాంగ్రెస్ ఏకమై ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకున్నాయి. పవర్ దగ్గరకు వచ్చేసరికి రాజకీయ వైరాలు పక్కకు వెళ్లిపోవటం చూసినప్పుడు రాజకీయమా.. మజాకానా అనుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News