ఫోకస్ అంతా పాక్.. టీబీజేపీ రథసారధి ఇప్పట్లో తేలదంతే

తెలంగాణ బీజేపీకి నూతన సారధి ఏర్పాటు అవసరం. ఈ విషయంలో అధినాయకత్వం సైతం సానుకూలంగా ఉంది.;

Update: 2025-04-30 05:20 GMT

కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు..బోలెడన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. అయితే.. దానికి ఒక లెక్క ఉంటుందన్న విషయాన్ని పార్టీ అధినాయకత్వాలు మర్చిపోతుంటాయి. తెలంగాణ బీజేపీ నూతన రథసారధి విషయంలో సాగుతున్న జాగు.. ఆ పార్టీ నేతలకు.. క్యాడర్ కు చిరాకు తెప్పించేలా మారింది. తెలంగాణ బీజేపీకి నూతన సారధి ఏర్పాటు అవసరం. ఈ విషయంలో అధినాయకత్వం సైతం సానుకూలంగా ఉంది. అయితే.. తమ లెక్కలకు సూట్ అయ్యే నేతను ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి.

ఇదిగో ఎంపిక పూర్తైంది.. ప్రకటనే మిగిలి ఉందని చెబుతున్నప్పటికీ.. క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయే తప్పించి.. కొత్త సారధి ఎవరన్న ప్రకటన మాత్రం వెల్లడి కాని పరిస్థితి. పహల్గాం పరిణామాల నేపథ్యంలో.. కొత్త సారధి ఎంపిక మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. నిజానికి ఒక్క తెలంగాణనే కాదు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల సారధులు.. చివరకు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగాల్సి ఉంది.

అయితే.. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ అంశాల మీద పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ చేసే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడు వారి ఫోకస్ మొత్తం పాకిస్థాన్ మీదనే ఉందని చెప్పాలి. సరైన రీతిలో దాయాదికి బుద్ది చెప్పాలన్న అంశం మీదనే పార్టీ చూపంతా ఉందని చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితులు మొత్తం మారిపోవటమే కాదు.. ప్రాధాన్యతల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా మారిపోయింది.

సమస్య ఏమంటే.. టీబీజేపీ సారధి ఎంపిక ఆలస్యమయ్యే కొద్దీ.. కొత్తగా ఎన్నికయ్యే వారికి సవాళ్లు భారీగా ఎదురవుతాయని చెబుతున్నారు. దీనికి కారణం.. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో.. ఉగ్రదాడి అంశాలు ఒక కొలిక్కి వచ్చి.. సారధిని ఎంపిక చేసిన వెంటనే.. ఎన్నికలు ముందుకు వస్తే .. కొత్త సారధికి తిప్పలు తప్పవని చెప్పాలి. ఇదొక ఇబ్బంది అయితే.. గడిచిన కొద్దిరోజులుగా ఎలాంటికార్యక్రమాల్ని పార్టీ నిర్వహించలేదు.

కొత్త నాయకత్వం కొలువు తీరిన తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టాలన్నట్లుగా నాయకులు ఉన్నారు. దీంతో నియామక ప్రకటన వెలువడి.. పార్టీ నేతలంతా కలిసి కార్యక్రమాలు చేపట్టేందుకు మరింత సమయం పడుతుంది. అదే జరిగితే.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెద్దగా చూపలేదన్న ప్రచారం సాగుతోంది. పార్టీ నూతన సారధిని ఎంపిక చేసే విషయంలో జరుగుతున్న ఆలస్యం.. పార్టీ క్యాడర్ లోనూ నిరాశను నింపుతోందని చెబుతున్నారు. అన్ని విషయాలకు కాకున్నా కొన్ని అంశాల విషయంలో అయినా.. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News