'రిజర్వేషన్' కోసం ఎందుకింత ఆ(పో)రాటం!
స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ కోసం పంతానికి పోతోంది.;
స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ కోసం పంతానికి పోతోంది. తాము అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్(42 శాతం) బిల్లును ఎట్టి పరి స్థితిలోనూ రాష్ట్రపతి ఆమోదించాలని పట్టుబడుతోంది. ఢిల్లీ వేదికగా ధర్నాలు, నిరసనలకు కూడా దిగిం ది. అయితే.. బీసీల రిజర్వేషన్ కోసం ఇంత ఆరాటం, పోరాటం ఎందుకు? అది లేకుండా ఎన్నికలకు వెళ్తే.. ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? అనేది ప్రశ్న.
మంచి చేయడం తప్పుకాదు. కానీ, ఆ పేరుతో కాలహరణం చేసేలా ఢిల్లీకి వెళ్లి నిరసనలు చేపట్టడంపైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. వాస్తవానికి రిజర్వేషన్ కల్పించడం ద్వారా గ్రామ,మండల, జిల్లాపరిధిలోని స్థానిక సంస్థల్లో పాగా వేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తమకు దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే.. రిజర్వేషన్ ఆమోదం, అమలుపై పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
కానీ, నిజానికి ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ అమలు చేయడం కూడా సాధ్యంకాదని.. అధికార వర్గాలు చెబు తున్నాయి. కుల గణన జరిగినా.. కూడా క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ అమలు చేసేందుకు మరో కసరత్తు జరగాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. కుల గణనలో ఎంత మంది ఏయే కులాల వారు ఉన్నారన్నది మాత్రమే ఖరారైందని, దీనిని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసే అవకాశం ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం బీసీ, బీసీ-ఏ, బీ, సీ, డీ వర్గీకరణలు ఉన్నాయని, కొత్తగా కల్పించే రిజర్వేషన్ కేటగిరీకి ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంటుందని అంటున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసంలో కనీసం మూడు మాసాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి సంతకంచేసినా.. అది వెంటనే అమలు జరగడం అనే ది కుదరదని చెబుతున్నారు. కానీ, సీఎం మాత్రం దీని కోసం ఆరాటం, పోరాటం చేస్తున్నారు. ఇదిలావుం టే.. ఎంత రిజర్వేషన్ ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో సర్కారు చేపట్టే పనులు, అభివృద్ధి, పాలన తీరుకే మార్కులు పడతాయని, కేవలం రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రజలు ఓటు వేస్తారని చెప్పలేరని అంటున్నారు. కాబట్టి.. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే బదులు, ప్రశాంతంగా వ్యవహరిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా రిజర్వేషన్‌ను అమలు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.