బీసీ వర్సెస్ బీసీ: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం!
బాడీ పెరిగితే ఉపయోగం లేదని.. అవగాహన పెరగాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి గంగుల వ్యాఖ్యానించారు.;
తెలంగాణ అసెంబ్లీలో బీసీల విషయంపై అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాదోపవాదాలు.. మాటల యుద్ధాలు చోటు చేసుకున్నాయి. బీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత.. దీనికి కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. అయితే.. బీసీలకు తామే మేలు చేశామని.. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వమే బీసీల కోసం.. ఎంతో చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో గంగుల చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి.
బాడీ పెరిగితే ఉపయోగం లేదని.. అవగాహన పెరగాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి గంగుల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పొన్నం కూడా అదే రేంజ్‌లో మండిపడ్డారు. సభలో హుందాగా ప్రవర్తిం చాలని.. బాడీ షేమింగ్ మాటలు సరికాదని వ్యాఖ్యానించారు. బీసీల కోసం తామే 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పారు. నిజానికి బీసీలపై బీఆర్ ఎస్‌కు ప్రేమ ఉంటే.. తమతో ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. పైగా బిల్లుపై తెచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శిం చారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న కేటీఆర్.. బీసీలకు అనేక పదవులు ఇచ్చామని.. ఓబీసీ కమిషన్ వేయా లని అప్పట్లోనే ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తమ నాయకుడు కేసీఆర్ పదే పదే కోరారని తెలిపారు. మధు సూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ చేశామని, స్వామి గౌడ్‌ను మండలి చైర్మన్‌ను చేశామని.. గతం తవ్వారు. అయితే.. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు.. 42 శాతం రిజర్వేషన్ పై చర్చించమంటే.. పాతవి తవ్వుతున్నా రని.. వారికి ఇష్టంలేకేనే ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో తాము 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదం పొందేందుకు ప్రయత్నించి ధర్నాలు చేస్తే.. బీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు తమకు మద్దతు పలికారని అన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి లేని విధంగా వ్యవహరిస్తోందని.. కేటీఆర్ దుయ్యబట్టారు. ఇలా.. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అనంతరం ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.