ఐదుసార్లు తప్పించుకుని ఆరోసారి బలైపోయాడు.. గద్వాల కేసులో సంచలన విషయాలు
ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ తో వివాహమైనా ప్రియుడుపై మోజు వల్లే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని అంటున్నారు.;
నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నువ్వు అంటే ఇష్టమంటూ పెళ్లి చేసుకున్న భార్య.. వివాహం చేసుకున్న నెలరోజుల్లో ఐదుసార్లు అతడిని అంతమొందించేందుకు ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తున్నారు. ఈ ఘటనకు హతుడి భార్య ఐశ్వర్య వివాహేతర సంబంధమే కారణంగా నిర్ధారించిన పోలీసులు.. ఐశ్వర్యకు సహకరించి, హత్యకు పథకం రచించిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు సహకరించి, ప్లాన్ చేసిన అందరి అరెస్టుకు పావులు కదుపుతున్నారు.
ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ తో వివాహమైనా ప్రియుడుపై మోజు వల్లే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని అంటున్నారు. తేజేశ్వర్ హత్యకు సుపారీ ఇచ్చిన నిందితులు.. హతుడి బైక్ కు జీపీఎస్ ట్రాకర్ అమర్చారని, ఆయన ఎక్కడ ఉన్నది తెలుసుకుని చంపేందుకు ఐదుసార్లు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. పెళ్లికి ముందు నుంచి బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉండేదని పోలీసుల విచారణలో బయటపడింది. నిందితురాలు ఐశ్వర్య తల్లి సుజాత పనిచేస్తున్న బ్యాంకులో తిరుమలరావు మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు వివాహమైనా పిల్లలు కలగలేదని చెబుతున్నారు. పిల్లల కోసం ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించిన తిరుమలరావు తన ఇంటికి ఐశ్వర్యను తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.
అయితే ఐశ్వర్యను ద్వితీయ వివాహం చేసుకోవడాన్ని మొదటి భార్య వ్యతిరేకించడంతో తిరిగి ఇంటికి పంపేశాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించడంతో గద్వాలకు చెందిన తేజేశ్వర్ తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అయితే తిరుమలరావుతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఐశ్వర్య ఇటు భర్తతోపాటు అటు తిరుమలరావుతోనూ మాట్లాడేది. పెళ్లికి ముందు తేజేశ్వర్ అంటే ఇష్టమని డ్రామా ఆడటంతో ఫిబ్రవరిలో పెళ్లి నిలిచిపోయినా, తేజేశ్వర్ కుటుంబ సభ్యులను ఎదిరించి మేలో ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు.
పెళ్లి అయిన రెండు రోజుల తర్వాత ఐశ్వర్య తన ప్రియుడు తిరుమలరావుతో చాటింగ్ చేయడాన్ని గమనించిన తేజేశ్వర్ మందలించాడని చెబుతున్నారు. దీంతో తమ బంధానికి తేజేశ్వర్ అడ్డువస్తున్నాడనే ఆలోచనతో ఐశ్వర్య అతడిని హత్య చేసినట్లు చెబుతున్నారు. దీనికి బ్యాంకు మేనేజర్ తిరుమలరావు కొందరికి సుపారీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ‘ఎలాగైనా తేజేశ్వర్ ను వదిలించుకుని నీ దగ్గరకు వచ్చేస్తానని’ ఐశ్వర్య బలవంతం చేయడంతో హత్య చేయాలని తిరుమలరావు స్కెచ్ వేశాడని పోలీసులు తెలిపారు. తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్ కావడంతో ఎప్పుడూ ఒక చోట ఉండడని, భూముల సర్వే పేరుతో బయట తిరుగుతుండటం వల్ల అతడిని ట్రాక్ చేసేందుకు జీపీఎస్ వాడినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐదుసార్లు తేజేశ్వర్ పై దాడికి ప్లాన్ చేసినా, కుదరకపోవడంతో నేరుగా రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగు భూమి కొలతల పేరుతో తేజేశ్వర్ ను దూరంగా తీసుకువెళ్లి హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తొలుత అదృశ్యం కేసు నమోదు చేసిన గద్వాల పోలీసులు తేజేశ్వర్ డెడ్ బాడీ లభించిన తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు జరపడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందని అంటున్నారు.