9-5 జాబ్ చేస్తూ 108 దేశాలు చుట్టేసిన టెకీ

కానీ తమిళనాడుకు చెందిన ఓ టెకీ ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. పక్కా ప్లానింగ్‌తో ఫుల్ టైమ్ జాబ్ చేస్తూనే ఏకంగా 108 దేశాలు చుట్టేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.;

Update: 2025-05-04 03:00 GMT

సాధారణంగా 9-5 ఫుల్ టైమ్ ఉద్యోగం అంటే ఇక ప్రయాణాలకు, వ్యక్తిగత ఆసక్తులకు సమయం దొరకడం కష్టమని చాలామంది భావిస్తారు. వారాంతాలు, సెలవులు కుటుంబంతోనో, విశ్రాంతి తీసుకోవడానికో సరిపోతాయని అనుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ టెకీ ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. పక్కా ప్లానింగ్‌తో ఫుల్ టైమ్ జాబ్ చేస్తూనే ఏకంగా 108 దేశాలు చుట్టేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.

ఆమే అంకితా రాజేంద్రన్. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అంకితకు చిన్నప్పటి నుంచీ ప్రపంచం చుట్టేయాలని కల. ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఆమె ఉద్యోగాన్ని వదులుకోలేదు, సమయం వస్తుందని ఎదురుచూడలేదు. బదులుగా, తెలివిగా ప్లాన్ చేసుకుంది.

తన ఆదాయంలో దాదాపు 30 శాతాన్ని ప్రయాణాల కోసమే కేటాయించుకుంది అంకిత. వచ్చిన ప్రతి లాంగ్ వీకెండ్‌ను, దొరికిన ప్రతి సెలవును ట్రావెలింగ్‌కు ఉపయోగించుకుంది. ఇలా ఒక్కో అడుగు వేస్తూ ఏకంగా 7 ఖండాల్లోని 108 దేశాలను సందర్శించింది. ఉద్యోగం తన ట్రావెలింగ్ ప్యాషన్‌కు అడ్డుకాదని, సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చని ఆమె నిరూపించింది.

ప్రయాణాలపై తనకున్న దృక్పథాన్ని పంచుకుంటూ, వాటిని ఏదో ఒక రోజు దొరికే 'రివార్డ్' లా కాకుండా, తమ జీవితంలో ఓ 'ప్రాధాన్యత'గా గుర్తించాలని అంకిత సూచిస్తోంది. పెద్దగా సమయం దొరికే వరకు ఎదురుచూడకుండా, చిన్న చిన్న ప్లాన్‌లతో, స్మార్ట్‌గా ప్రయాణాలను ప్రారంభించాలని ఆమె చెబుతోంది. అంకిత ప్రయాణ కథ ఉద్యోగం చేస్తూ కూడా తమ కలలను, అభిరుచులను ఎలా కొనసాగించవచ్చో చెప్పడానికి ఓ గొప్ప ఉదాహరణ.

ఆమె అనుభవం స్పష్టం చేసేదేమిటంటే.. ప్యాషన్ ఉంటే దానికి సమయం కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదు. పక్కా ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ, దొరికిన సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా ఉద్యోగం చేస్తూనే ప్రపంచాన్ని చుట్టేయాలన్న కలను కూడా నిజం చేసుకోవచ్చు.

Tags:    

Similar News